హైదరాబాద్ : డిగ్రీ కోర్సుల ఫీజులు బాగా పెరిగే అవకాశాలున్నాయ్. 2019-20 విద్యా సంవత్సరానికి ఆయా కోర్సులను బట్టి రూ. 5 వేల నుండి రూ. 10 వేల వరకు ఫీజులు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు జరుపుతోంది. దీని వల్ల డిగ్రీ చేరే లక్షల మంది విద్యార్థులపై ఫీజు భారం తప్పేట్లు లేదు. డిగ్రీ కాలేజీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే ఫీజుల పెంపుకు ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫీజుల పెంపు ద్వారా ఆయా యాజమాన్యాలకు మేలు జరుగనుంది. కామన్ ఫీజు చేస్తామని చెబుతూనే అన్ని వర్సిటీ పరిధిలోకి ఒకే రకమైన ఫీజు విధానం తీసుకరానుందని టాక్.
డిగ్రీలో చేరే పేద విద్యార్థులకు గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పిస్తోంది. అయితే కామన్ ఫీజు అమల్లోకి తెచ్చి అదనంగా పెంచే మొత్తాన్ని విద్యార్థుల నుండే వసూలు చేసేలా నిబంధన కూడా తీసుకరానున్నట్లు తెలుస్తోంది. పెంచిన ఫీజు మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ పరిధిలోకి రాదు. వీటిని స్టూడెంట్స్ పేరెంట్స్ చెల్లించడం జరుగుతోంది. ఫీజుల పెంపు భారంపై డిగ్రీ ప్రవేశాల కమిటీ సమావేశంలో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో 1,084 డిగ్రీ కాలేజీల్లో 4.20 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా…ఇందులో 2.20 లక్షల సీట్లు భర్తీ కాలేదు. మరి ఫీజులు పెంచితే మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.
ఫీజులు ఒకవేళ పెంచితే పేద, మధ్య తరగతి స్టూడెంట్స్ డిగ్రీ చదువులకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. తక్కువ ఫీజుతో నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు డిగ్రీ చదువులు చదువుతున్నారు. పెంచిన ఫీజు అమల్లోకి వస్తే మాత్రం పేదలు ఉన్నత విద్య చదవడం ఇక కలగానే మిగిలిపోనుంది.