JEE Main 2024: జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ సవరణ
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సవరించింది.

JEE Main 2024 Exam Schedule Revised For Session 2 Check New dates Here
JEE Main 2024: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ మారింది. ఏప్రిల్ 4 నుంచి 15 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. అంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ లో ఏప్రిల్ 1 నుంచి 15 పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే షెడ్యూల్ ను తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సవరించింది.
JEE మెయిన్ సెషన్ 2 పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 25న విడుదలయ్యే అవకాశముంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి, అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మార్చి 2. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడనేది అభ్యర్థులకు మార్చి మూడో వారంలోపు సమాచారం అందుతుంది. పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డ్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.
JEE మెయిన్ 2024 సెషన్ 1 కోసం దరఖాస్తు చేసి.. సెషన్ 2 పరీక్షలకూ హాజరుకావాలనుకునే వారు.. సెషన్ 1 అప్లికేషన్ నంబరు, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వొచ్చు. అయితే ఇంతకు ముందు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు మాత్రం సెషన్ 2 JEE మెయిన్‌కు ప్రెష్ గా అప్లై చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేయడానికి వీలులేదు. ఏ అభ్యర్థి అయినా ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ నంబర్‌లను కలిగి ఉన్నట్టు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT), ఇతర కేంద్ర నిధులతో పనిచేసే సాంకేతిక సంస్థలు (CFTI) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశానికి JEE మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంటర్మీడియట్ లో కనీసం 75 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే JEE రాయడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కలిగిన వారు 65 శాతం మార్కులు కలిగివుండాలి. సీబీఎస్ఈ విద్యార్థులు టాప్ 20 పర్సంటైల్ సాధిస్తేనే JEE రాయడానికి అనుమతిస్తారు.