Group 1 Mains: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలుసా?
అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి.

Group 1 Mains Exams
తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించేందుకు టీజీపీఎస్సీ ఫుల్ స్పీడ్‌తో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. పరీక్ష రాసిన అభ్యర్థులు సాధించే మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీని అనంతరం ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన చేయనుంది. ఆ తర్వాత రెండు వారాల్లో తుది ఫలితాలను వెల్లడిస్తారు. వచ్చే నెల తొలి వారంలో జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటిస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత తుది జాబితా రానుంది.
Also Read: హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్ సీజ్.. సెలెబ్రిటీలు వచ్చే ఈ హోటల్ ఎందుకిలా..?
గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించిన అనంతరం గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3 ఫలితాలను వెల్లడించాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది. 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీ కోసం టీజీపీఎస్సీ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రిలిమ్స్ పరీక్షలు గత సంవత్సరం జరిగాయి.
అలాగే, అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 21,093 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. ప్రిలిమ్స్ లో మొత్తం 31,383 మంది అర్హత సాధించారు. వారిలో 67.17 శాతం మాత్రమే మెయిన్స్ పరీక్ష రాశారు.
ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది మాత్రమే పోటీలో ఉన్నారు. మెయిన్స్ ఫలితాలు వచ్చాక మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్ ఆప్షన్ ఇవ్వనున్నారు. 15 రోజుల్లోగా ఒక్కో పేపరుకు రూ.1,000 చొప్పున రుసుము చెల్లించి రీకౌంటింగ్ చేయించుకోవచ్చు.