Hamirpur: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నియోజకవర్గంలోని ఐదు స్థానాల్లోనూ ఓడిన బీజేపీ.. స్వల్ప మెజారిటీతో నడ్డా సేఫ్
నడ్డా స్వస్థలం అయిన బిలాస్‌పూర్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను అతి స్వల్ప మెజారిటీతో బీజేపీ గెలుచుకుంది. దీంతో ఆయనకు కాస్త ఊరట లభించింది. ఇక హమిర్‌పూర్‌లోని ఐదు స్థానాల్లో బీజేపీ ఓడటంపై పార్టీ కార్యకర్తలు అనురాగ్ ఠాకూర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు

BJP Lost All 5 Seats In Minister Anurag Thakur Constituency
Hamirpur: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నియోజకవర్గంలో ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. హమిర్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అనురాగ్ ఠాకూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇకపోతే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రాతినిధ్యం వహిస్తున్న బిలాస్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని మూడు స్థానాల్లోనూ కమలం పార్టీ విజయం సాధించింది.
అనురాగ్ ఠాకూర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ తరుచూ పోటీ చేసే సుజన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ మెజారిటీ 399 ఓట్లు. వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో ధుమాల్‌కు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆ స్థానంలో ఆయనతో పాటు, పార్టీ కూడా విరమణ తీసుకున్నట్టైంది. బొరంజులో కేవలం 60 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఓడారు. హమిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక బర్సార్, నదౌన్ అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుచుకుంది.
ఇక నడ్డా స్వస్థలం అయిన బిలాస్‌పూర్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను అతి స్వల్ప మెజారిటీతో బీజేపీ గెలుచుకుంది. దీంతో ఆయనకు కాస్త ఊరట లభించింది. ఇక హమిర్‌పూర్‌లోని ఐదు స్థానాల్లో బీజేపీ ఓడటంపై పార్టీ కార్యకర్తలు అనురాగ్ ఠాకూర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రెబెల్స్ బెడద బీజేపీని బాగా ఇబ్బంది పెట్టింది. 68 నియోజకవర్గాల్లో 28 చోట్ల బీజేపీ రెబెల్స్ పోటీ చేశారు. ఇందులో ఇద్దరు విజయం సాధించారు.