Kidney Disease Symptoms: కిడ్నీ సమస్యను గుర్తించే 5 లక్షణాలు.. ఇవి ప్రమాదానికి సంకేతం.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Kidney Disease Symptoms: కిడ్నీ సమస్య ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపించడం అనేది మొదటగా మూత్రం రూపంలోనే బయటపడుతుంది.

5 symptoms to identify kidney problems
మన శరీరంలోని ప్రతి అవయవం దీనిపని అది సమర్థంగా చేయడం వల్లనే ఆరోగ్యంగా జీవించగలం. అలాంటి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (వృక్కాలు) ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తాయి, వ్యర్థ పదార్థాలను మూత్రరూపంలో బయటకు పంపిస్తాయి. రక్తపోటు నియంత్రణ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, ఎలక్ట్రోలైట్ సమతుల్యత వంటి ఎన్నో కీలక పనులు ఇవి నిర్వహిస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యం అనేది చాలా అవసరం. కాకపోతే, ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడ్తున్నారు. చిన్న వయసులోనే ఈ సమస్య బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కిడ్నీ సమస్యలను ముందే గుర్తిస్తే నయం చేయడానికి చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, శరీరం కూడా కొన్ని రకాల సిగ్నల్స్ తో కిడ్నీ సమస్యను మనకు తెలియజేయడానికి ప్రయత్నిస్తుంది. వాటిని మనం ముందే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే రోగం ముదరకముందే నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1.మూత్రంలో మార్పులు:
కిడ్నీ సమస్య ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపించడం అనేది మొదటగా మూత్రం రూపంలోనే బయటపడుతుంది. మూత్రం రంగు మారడం, నురగలు రావడం, మూత్రంలో రక్తం కనిపించడం, తరచూ మూత్రం రావడం ముఖ్యంగా రాత్రి పూట, మూత్రం బయటకు వెళ్తున్నప్పుడు ఇబ్బంది లాంటివన్నీ కిడ్నీలు సరిగా వ్యర్థాలను బయటకు పంపలేకపోతున్నాయని సూచించే లక్షణాలు. కాబట్టి ఏ లక్షణాలు గనక మీలో కనిపిస్తే జాగ్రత్త పడటం అవసరం.
2.కాళ్లు, చేతులు, ముఖం ఉబ్బిపోవడం:
కిడ్నీలు శరీరంలో ఉన్న అదనపు ద్రవాన్ని బయటకు పంపుతాయి. కానీ అది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ద్రవం శరీరంలో నిల్వ అవుతుంది. ఫలితంగా కాళ్లు, మోకాల్లు, పాదాలు, చేతులు, కళ్ళ చుట్టూ ఉంబ్బిపోతుంది. ఇది కిడ్నీ పనితీరు మందగిస్తుంది అనడానికి ప్రధాన సంకేతం.
3.మితిమీరిన అలసట, శక్తి లేకపోవడం:
కిడ్నీలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన హార్మోన్లు ఎరిథ్రోపోయెటిన్ ను ఉత్పత్తి చేస్తాయి. కానీ, అవి సరిగ్గా పనిచేయకపోతే రక్తహీనత (అనీమియా) ఏర్పడుతుంది. శరీరానికి ఆక్సిజన్ సరఫరా తక్కువ అవుతుంది. దీనివల్ల అలసట, శక్తిలేకపోవడం, తలనొప్పులు వంటి సమస్యలు కనిపిస్తాయి. ప్రతిరోజూ తగిన నిద్రపోయినప్పటికీ అలసట అనిపిస్తే, ఇది కిడ్నీ సమస్యకు సంకేతంగా భావించవచ్చు.
4.చర్మం పొడిబారడం:
కిడ్నీలు వ్యర్థాలను శరీరం నుంచి తొలగించకపోతే, అవి రక్తంలో పేరుకుపోతాయి. అలా జరగడం వల్ల చర్మంపై ప్రభావం చూపిస్తుంది. చర్మం పొడిగా మారుతుంది, తీవ్రమైన దురద (itching) ఏర్పడుతుంది. తల, చేతులు, పొత్తికడుపు ప్రాంతాల్లో కొన్నిరకాల మార్పులు కనిపిస్తాయి.
5.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో బరువు:
కిడ్నీలు పనితీరు కోల్పోతే, ద్రవం ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంది. ఫలితంగా, ఛాతీలో ఒత్తిడి, శ్వాసతీసుకోవడంలో కష్టం, మెట్లెక్కినప్పుడు ఆయాసం అనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కిడ్నీ ఆరోగ్య చిట్కాలు:
- రోజుకి తప్పకుండా 2.5 లీటర్ల నీరు తాగాలి
- ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి
- మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవడం మంచిది
- ఆల్కహాల్, పొగ త్రాగడం అలవాటుకు దూరంగా ఉండండి
- రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మర్చిపోకండి
కిడ్నీ సమస్యలు మొదట్లో గమనించకపోతే, అది తీవ్రమైన దశలకు వెళ్లే ప్రమాదం ఉంది. డయాలసిస్, ట్రాన్స్‌ప్లాంట్ లాంటి చికిత్సల దశకు వెళ్లకుండానే, మీరు ఈ లక్షణాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటే ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.