ఈ చలికాలంలోనే కరోనా పోయి సాధారణ స్థితికి వచ్చేస్తామంట!

  • Publish Date - November 15, 2020 / 06:51 PM IST

Normal life back next winter : కరోనావైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ల కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. కానీ, కొత్త కరోనా వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆగాల్సిందే అంటున్నారు.



ఈలోపే కరోనా నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని వ్యాక్సిన్ క్రియేటర్ ఒకరు అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించి వచ్చే శీతాకాలంలోనే తిరిగి సాధారణ జీవితంలోకి వస్తామని బయెంటెక్ సహా వ్యవస్థాపకులు ప్రొఫెసర్ Ugur Sahin ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ శీతాకాలం సమయంలో వ్యాక్సిన్ వచ్చినా వైరస్ బాధితులపై పెద్దగా ప్రభావం చేయదని అంటున్నారు. BioNTech, Pfizer సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ 90శాతానికి కంటే ఎక్కువగా వైరస్‌ను ఎదుర్కోగలదని తమ ప్రథమ విశ్లేషణలో నిర్ధారణకు వచ్చారు.



దీనికి సంబంధించి నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో 43వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆఖరిలోగా 10 మిలియన్ల డోస్ లు వ్యాక్సిన్ అందబాటులోకి రావొచ్చునని యూకే అంచనా వేస్తోంది. ఇప్పటికే 30 మిలియన్ల వ్యాక్సిన్ డోస్ లను ఆర్డర్ చేసేసింది.



వ్యాక్సిన్ వచ్చాక మూడు వారాల వ్యవధిలో ఒక్కొక్కరికి రెండు మోతాదుల్లో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ ముందుగా తీసుకునేవారలో ఆరోగ్య కార్యకర్తలు, 80 ఏళ్లు ఆపై వయస్సు ఉన్నవారికి ప్రప్రథమంగా అందించనున్నారు.



వయస్సు బట్టి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. అత్యంత సమర్థవంతమైన వ్యాక్సిన్ ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించగలమనే ధృడ విశ్వాసం ఉందని సాహిన్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ 90శాతం సమర్థవంతం కాకపోవచ్చు.. కానీ, 50శాతం వరకు సమర్థవంతంగా పనిచేస్తుందనే నమ్మకం ఉందన్నారు.