కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లో ఏది బాగా పనిచేస్తుందో తేలిపోయింది.. చరిత్రలో ఇలాంటి పరిశోధన చేయడం ఇదే తొలిసారి
COVID 19 Vaccine: కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో రోగనిరోధక ప్రతిస్పందనలు కొవాగ్జిన్ వేయించుకున్న వారిలో కంటే..

Vaccines
కరోనాను ఎదుర్కోవడానికి భారతీయులు అత్యధికంగా వేయించుకున్న వ్యాక్సిన్లు కొవిషీల్డ్, కొవాగ్జిన్. వీటిలో ఏది బాగా పనిచేస్తుందో తేలిపోయింది. వ్యాక్సిన్లలో ఏది ఉత్తమంగా పనిచేస్తుందన్న విషయాన్ని తేల్చడానికి పరిశోధన చేయడం ఇదే తొలిసారి.
నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్ మరింత బాగా పనిచేస్తుందని తేల్చారు. మార్చి 6న ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియాలో ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రచురించారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వేయించుకున్న వారిలో రోగనిరోధక ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని పరిశోధకులు తేల్చారు.
ఈ పరిశోధనలో 11 సంస్థలు పాలుపంచుకున్నాయి. వాటిలో ఆరు సంస్థలు పుణెకు చెందినవే. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణె, నేషనల్ కెమికల్ లాబొరేటరీ, నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, పూణె నాలెడ్జ్ క్లస్టర్ కూడా ఇందులో ఉన్నాయి. 2021 జూన్ నుంచి 2022 జనవరి వరకు ఈ పరిశోధన చేశారు. బెంగళూరు, పూణెకు చెందిన 691 మంది (18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు) ఇందులో పాల్గొన్నారు.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో రోగనిరోధక ప్రతిస్పందనలు కొవాగ్జిన్ వేయించుకున్న వారిలో కంటే అధికంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. అలాగే కొవిషీల్డ్ వేయించుకున్న వారిలో యాంటీబాడీ స్థాయిల ఉత్పత్తి అధికంగా ఉంది. దీంతో ఇది ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే టీ సెల్స్‌ను మాత్రం కొవిషీల్డ్ కంటే కొవాగ్జిన్ అధికంగా ప్రేరేపించినట్లు పరిశోధనలో తేలింది.
ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ను పూణెలోని అదార్ పూనావాలాకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. కొవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది.
Also Read : హాస్పిటల్‌లో తమిళ్ హీరో అజిత్.. ఫ్యాన్స్ టెన్షన్.. అసలు ఏమైంది..!