ఇది నిజంగా కాఫీ తాగేవారికి శుభవార్తనే. కాఫీ తాగటం వలన గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, జీవిత కాలాన్నికూడా పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. అయితే, ఎంత కాఫీ ఎన్ని సార్లు తాగుతున్నామనేది కంటే, దాన్ని ఎప్పుడు తాగుతున్నామనేదే కీలకమని వెల్లడించారు. రోజంతా కాఫీ తాగే వారితో పోల్చినప్పుడు, ఉదయాన్నే కాఫీ తాగే వారికి గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా మరణించే ముప్పు తక్కువగా ఉంటుందని తేలింది.
సారాంశంగా చెప్పాలంటే, ఉదయాన్నే కాఫీ తాగటం వలన గుండె సంబంధిత జబ్బుల ప్రమాదాన్ని పెంచదని సర్వే రిపోర్ట్ చెబుతుంది. అంతేకాక, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును కూడా తగ్గించే అవకాశముందని తెలుస్తోంది. ఈ అధ్యయనంలో శరీరంపై కెఫీన్ ప్రభావాలను పరిశీలించడంతో పాటు, రోజులో కాఫీ తాగే సమయాన్ని గుండె ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని గమనించారు. (చదవండి: మీరు కూడా ఆఫీస్ లో గంటలు గంటలు కూర్చొని పని చేసే బ్యాచ్ లోనే ఉన్నారా?.. మీకు ఓ షాకింగ్ న్యూస్.. )
యూఎస్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ అనే సంస్థ 40,725 మంది పై సర్వే నిర్వహించింది. అనగా రోజు వారు తీసుకునే ఆహారం, పానీయాల పై వివరాలను దాదాపు పదేళ్ల పాటు పరిశీలించారు. అలాగే సర్వే సమయంలో సంభవించిన మరణాలు, వాటి కారణాలను కూడా నమోదు చేశారు. ఫలితంగా, కాఫీ తాగని వారితో పోలిస్తే ఉదయాన్నే కాఫీ తాగే వారిలో ఏ కారణంతోనైనా మరణించే ముప్పు 16% తక్కువగా, గుండెజబ్బుతో మరణించే ముప్పు 31% తక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే, రోజంతా తరచుగా కాఫీ తాగే వారిలో ఈ ప్రయోజనాలు కనబడలేదు.(చదవండి: టీచర్స్, పేరెంట్స్ మీరో పని చేయండి… ఎగ్జామ్స్ టైమ్ లో పిల్లల్ని టెన్షన్ పెట్టకుండా.. జస్ట్ ఈ 6 టిప్స్ పాటిస్తే)
ఉదయాన్నే కాఫీ తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధులతో మరణాలు ఎందుకు తక్కువగా ఉన్నాయో స్పష్టంగా అధ్యయనంలో తెలియరాలేదు. కానీ మధ్యాహ్నం లేదా సాయంత్రం కాఫీ తాగితే శరీర జీవ గడియారం (సర్కేడియన్ రిథమ్), మెలటోనిన్ హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్), రక్తపోటు వంటి గుండెజబ్బులకు దారితీసే అంశాలను ప్రేరేపించవచ్చని సూచిస్తున్నారు.