అందుబాటులోకి కార్పొరేట్‌ వైద్యం : తెలంగాణ వైద్యశాఖలో మార్పులు

  • Published By: veegamteam ,Published On : May 15, 2019 / 02:41 PM IST
అందుబాటులోకి కార్పొరేట్‌ వైద్యం : తెలంగాణ వైద్యశాఖలో మార్పులు

Updated On : May 15, 2019 / 2:41 PM IST

తెలంగాణ వైద్యశాఖలో భారీగా మార్పులు జరగనున్నాయి. ప్రజలు సులువుగా వైద్య సేవలు పొందడానికి తీసుకోవాల్సిన అంశాలపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాల్లో మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల కోడ్‌ తరువాత ప్రభుత్వం కొత్తగా అందించే వైద్యసేవలతో పాటు ఉద్యోగులకు ఉచితంగా ఇస్తున్న వైద్యం స్థానంలో కార్పొరేట్‌ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ పథకంలో ఉద్యోగులను భాగస్వామ్యం చేసి, నామమాత్రపు ఫీజుతో కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా సానుకూలంగా ఉండటంతో ప్రైవేటు బీమా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న వారి కుటుంబాలకు, ఉద్యోగవిరమణ చేసినవారి కుటుంబాలకు వేర్వేరుగా నామమాత్రం రుసుం నిర్ణయించారు. ఈపథకంతో దాదాపు 7లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశముంది.

మందుల పంపిణీలో ఉన్న ప్రస్తుత విధానాన్ని రద్ధు చేస్తూ కొత్తగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి మందుల పంపిణీపై పూర్తి నిఘా పెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఆస్పత్రుల వారిగా సరఫరా చేసే మందులను రోజూ పర్యవేక్షించే విధంగా రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం చేయాలని, మందులు సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్‌ ద్వారా పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాట్లు చేయనుంది. ప్రస్తుత విధానంలో ఆస్పత్రుల వారిగా మందుల వినియోగానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందడం లేదని భావిస్తున్నారు. కొత్త ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఆశా వర్కర్ల సేవలను మరింత వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది. దీంతో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న సిబ్బంది కొరత తీరే అవకాశముందని అధికారులు అంటున్నారు.

హైదరాబాద్‌లోని ప్రధాన ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని టీ సర్కార్ కృషి చేస్తుంది.