Constipation Side Effects: మలబద్దకంతో అనేక ఆరోగ్య సమస్యలు.. ఇవి చాలా ప్రమాదం.. డాక్టర్స్ ఏమంటున్నారు అంటే?
Constipation Side Effects: నిజానికి మలబద్దకం అనేది చాలా పెద్ద సమస్య కానీ, దానివల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు తెలెత్తే అవకాశం ఉందని ప్రముఖ సీనియర్ నేచురోపతి డాక్టర్ షగుఫ్తా చెప్తున్నారు.

constipation side effects
మలబద్దకం సమస్యతో ప్రస్తుతం కాలంలో చాలా మంది బాధపడుతున్నారు. మారుతున్న పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, వేళా పాలా లేని తిండి ఇవన్నీ మలబద్దకం సమస్యకు కారణం అవుతున్నాయి. నిజానికి మలబద్దకం అనేది చాలా పెద్ద సమస్య కానీ, దానివల్ల మరిన్ని అనారోగ్య సమస్యలు తెలెత్తే అవకాశం ఉందని ప్రముఖ సీనియర్ నేచురోపతి డాక్టర్ షగుఫ్తా చెప్తున్నారు. మరి మలబద్దకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఆమె ఏమన్నారు ఇప్పుడు తెలుసుకుందాం.
మలబద్దకం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు:
హేమరాయిడ్స్:
మలవిసర్జన సమయంలో రక్తస్రావం జరగడాన్ని హెమరాయిడ్స్ అంటారు. మలవిసర్జన సరిగా జరగక పోవడం వల్ల అధిక ఒత్తిడి పెట్టి మలవిసర్జన చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా అధిక ఒత్తిడి చేయడం వల్ల మలద్వారం భాగంలో నరాలు పొడిసి హేమరాయిడ్స్ (piles) ఏర్పడతాయి. ఇది తీవ్రమైన రక్తస్రావానికి, భయంకరమైన నొప్పికి దారి తీస్తుంది.
కడుపు ఉబ్బరం (Bloating):
మలబద్దకంతో జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువకాలం మలం పేగుల్లోనే ఉండిపోవడం వల్ల అది గాసులుగా మారి కడుపు ఉబ్బరంగా మారుతుంది. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.
అనాల్ ఫిషర్స్ (Anal fissures):
మలం పేగుల్లో ఎక్కువకాలం ఉండిపోవడం వల్ల అది గట్టిగా మారి మలద్వారం చుట్టూ చీలికలు ఏర్పడి నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి.
మానసిక ఒత్తిడి(Mental Pressure):
తరచుగా మలవిసర్జన సరిగా కాకపోవడం వల్ల ఆందోళన, చిరాకు, నీరసత అనిపిస్తుంది. దీర్ఘకాలిక మలబద్దకం మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు.
ఆంతర్ల వాపు (Intestinal inflammation):
మలము శరీరంలో ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల టాక్సిన్లు విడుదలై జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. వాపులు ఏర్పడే ప్రమాదం ఉంది.
మలబద్దకం నివారణకు ఆరోగ్యవంతమైన అలవాట్లు:
పొట్టను శుభ్రంగా ఉంచే ఆహారం తీసుకోవాలి:
అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. గోధుమ రొట్టెలు, బ్రౌన్ రైస్, మినుముల కూరలు, స్నాక్స్‌గా పండ్లను ఎక్కువగా తినాలి. గుండ్రని పండ్లు,పెరుగు, పుచ్చకాయ, సీతాఫలం, బొప్పాయి ఎక్కువగా తీసుకోవాలి.
సరిపడా నీరు తీసుకోవాలి:
ఆరోగ్యకరమైన మనిషి కనీసం రోజుకి కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. గోరువెచ్చని నీరు ఉదయం ఖాళీ కడుపు మీద తాగడం మంచిది.
వ్యాయామం/యోగాసనాలు:
మలబద్దకానికి సరైన మందు వ్యాయామం. ప్రతిరోజూ నడక లేదా ప్రాణాయామం చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది.
టైమ్‌కి మలవిసర్జనకు వెళ్లాలి:
ఉదయం ఒకే సమయంలో మలవిసర్జనకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఇది శరీరాన్ని అదే టైమింగ్‌కి రెడీ చేస్తుంది.
కాఫీ, టీ, ఆల్కహాల్ తగ్గించాలి:
ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేసి మలాన్ని గట్టిగా చేస్తాయి. దీనివల్ల మలబద్దకం ఏర్పడవచ్చు.
సమస్య తీవ్రతను ఇలా గుర్తించండి?
- మూడు రోజులకు మించి మలబద్దకం ఉంటే
- మలంలో రక్తం కనబడితే
- తీవ్రమైన ఒత్తిడి, నొప్పి ఉంటే
- మలంలో పొడిబారి లేదా నల్లని రంగు ఉంటే