ప్రపంచపు తొలి కొవిడ్ వ్యాక్సిన్ కరోనా వైరస్‌ను ఎలా అంతం చేస్తుందంటే! వీడియో విడుదల చేసిన రష్యా

  • Published By: naveen ,Published On : August 18, 2020 / 01:33 PM IST
ప్రపంచపు తొలి కొవిడ్ వ్యాక్సిన్ కరోనా వైరస్‌ను ఎలా అంతం చేస్తుందంటే! వీడియో విడుదల చేసిన రష్యా

Updated On : August 18, 2020 / 3:40 PM IST

ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు కొవిడ్ టీకా ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. తమ దేశం ప్రపంచ తొలి కొవిడ్ టీకాను అభివృద్ధి చేసిందని రష్యా అధ్యక్షుడు పుతిన గతవారం ప్రకటన చేశారు. ఈ టీకా చాలా సమర్థవంతంగా పని చేస్తుందని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆయన చెప్పారు. అంతేకాదు తన కూతురు వ్యాక్సిన్ తీసుకున్నట్టు పుతిన్ వెల్లడించారు. మాస్కో కేంద్రంగా పని చేసే గమలేయ రిసెర్ట్ ఇన్ స్టిట్యూట్ స్పుత్నిక్ వీ కొడివ్-19 టీకాను అభివృద్ది చేసింది.



కాగా రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ పై అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. సరైన పద్ధతిలో వ్యాక్సిన్ డెవలప్ చేయలేదని, ట్రయల్స్ నిర్వహించలేదని, హడావుడిగా వ్యాక్సిన్ తీసుకొచ్చారని పలు దేశాల నిపుణులు అంటున్నారు. రష్యా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ సురక్షితం కాదని కూడా చెప్పారు. రష్యన్ కొవిడ్ టీకాను ఎట్టిపరిస్థితుల్లో వాడేది లేదని పలు దేశాలు ప్రకటించాయి. ఎవరి విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా రష్యా మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. తమ వ్యాక్సిన్ చాలా సురక్షితం అని చెబుతోంది.



తాజాగా రష్యా మరో అడుగు ముందుకేసింది. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కరోనా వైరస్ ను ఏ విధంగా అంతం చేస్తుందో తెలుపుతూ ఓ ప్రమోషనల్ వీడియోని విడుదల చేసింది. అది 38 సెకన్ల నిడివి ఉన్న సీజీఐ వీడియో. 1957లో రష్యా లాంచ్ చేసిన ప్రపంచ తొలి కృతిమ భూమి ఉపగ్రహం స్పుత్నిక్ – 1 నుంచి ప్రతిబింబించేలా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ను ఆ వీడియోలో చూపారు. ఈ భూగోళం మొత్తం వ్యాపించిన కరోనా వైరస్ ను మొల్లగా వ్యాక్సిన్ నిర్మూలించడం వీడియోలో చూపించారు.



రష్యా తొలి కొవిడ్ వ్యాక్సిన్, స్పుత్నిక్ వీ, ఉత్పత్తిని గత వారం నుంచే ప్రారంభించారు. వాస్తవానికి ఆదివారం రోజున కరోనా వ్యాక్సిన్ తొలి బ్యాచ్ ను ఉత్పత్తి చేశారు. వ్యాక్సిన్ ప్రస్తుతం చివరి దశ ట్రయల్స్ లో ఉందని రష్యా డిఫెన్స్ శాఖ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ చెప్పింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తుది దశ ట్రయల్స్ నిర్వహించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది. కాగా, డబ్ల్యూహెచ్ఓ మాత్రం, రష్యా వ్యాక్సిన్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెబుతోంది.

ప్రపంచ దేశాల అభిప్రాయం ఎలా ఉన్నా, రష్యా మాత్రం పూర్తి నమ్మకంగా ఉంది. తాము అభివృద్ధి చేసిన టీకా, ఈ భూగోళాన్ని కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడుతుందని చెబుతోంది. సెప్టెంబర్ నెలలో వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తారని అంచనా. కాగా ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లకు వ్యాక్సిన్ ఇస్తామని, ఆ తర్వాతే మిగతా వారికి టీకా ఇస్తామని రష్యా అధికారులు తెలిపారు.



బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనెకా, అమెరికా బయోటెక్ కంపెనీ మోడర్నా కూడా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అయ్యాయి. అవి అభివృద్ధి చేస్తున్న టీకాలు తుది దశ ట్రయల్స్ లో ఉన్నాయి. హ్యుమన్ ట్రయల్స్ లో భాగంగా వేలాది మందిపై పరీక్షలు జరుపుతున్నాయి. అమెరికాలో ఎన్నికల తేదీ నవంబర్ 3 నాటికి వ్యాక్సిన్ సిద్ధం అవుతుందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించేశారు. అయితే అమెరికాకే చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు అంటోనీ ఫౌసీ మాత్రం మరోలా చెబుతున్నారు. 2021 వరకు టీకా కోసం నిరీక్షణ తప్పదని అంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో టీకా వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

రష్యాలోని గమలెయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియోలజీ అండ్ మైక్రోబయోలజీ… ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ తయారుచేసినట్లు ప్రకటించింది. అయితే 1, 2 దశల్లో జరిగిన ట్రయల్స్‌కి సంబంధించిన వివరాల్ని సరిగా బయటపెట్టలేదు. అందుకే ఈ వ్యాక్సిన్‌పై పరిశోధకులు, నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు.



అసలు మూడో దశ ప్రయోగాలు చేయకుండా వ్యాక్సిన్ ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు. రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ సమర్థతనూ క్వశ్చన్ చేశారు. క్లినికల్ ట్రయల్స్ ఎలా జరిగాయో ఎందుకు చెప్పట్లేదని అడిగారు. రష్యా దగ్గర అంత అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయని నిలదీశారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మూడు దశల్లో ట్రయల్స్ పూర్తవ్వాల్సిందేనని చెబుతోంది. రష్యా ప్రభుత్వం మాత్రం ఈ రూల్ పక్కన పెట్టేసింది. ఓవైపు వ్యాక్సిన్ తయారు చేస్తూ మరోవైపు మూడో దశ ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయని చెబుతోంది.