కోరలు చాస్తున్న కరోనా…ప్రైవేట్ హాస్పిటల్స్ ను జాతీయం చేసిన స్పెయిన్

స్పెయిన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి, మిలటరీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. ఫుడ్,మెడిసిన్ ల కోసం షాపింగ్ వంటి కనీస అవసరాలకు,పని నుంచి ఇంటికి వెళ్లడం.రావడం తప్పితే ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని స్పెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రవాణా సదుపాయాన్ని కూడా తగ్గించింది. రెస్టారెంట్లు,హోటల్స్ కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఇప్పుడు కరోనాపై యుద్ధంలో భాగంగా స్పెయిన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ ను జాతీయం చేస్తున్నట్లు సోమవారం స్పెయిన్ ఆరోగ్యశాఖ మంత్రి స్లేవడార్ ఇల్లా ప్రకటించాడు. దేశంలోని అన్ని ఇది ప్రైవేట్ హెల్త్ ప్రొవైడర్స్,హాస్పిటల్స్ ను పబ్లిక్ కంట్రోల్ లోకి తీసుకొచ్చినట్లు ఆయన ప్రకటించాడు.
అంతేకాకుండా దేశంలోని నాలుగో ఏడాది చదువుతున్న మెడికల్ విద్యార్థులందరినీ స్పెయిన్ హెల్త్ సర్పీస్ కు సాయం చేయాలని కోరడం జరిగిందని ఇల్లా తెలిపారు. ఇదే సమయంలో మెడికల్ పరికరాలను ఉత్పత్తి చేయగల సామర్థం ఉన్న కంపెనీలు ప్రభుత్వంతో టచ్ లో ఉండాలని ఆయన తెలిపారు.
సోమవారం నాటికి స్పెయిన్ లో 309కరోనా మరణాలు నమోదు కాగా,9,191మంది కరోనా సోకి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. స్పెయిన్ లో ఆదివారం ఒక్క రోజే 2వేల కేసులు నమోదయ్యాయంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 7వేలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా చైనా,ఇటలీ,ఇరాన్ దేశాల్లో మరణాలు నమోదయ్యాయి. 1లక్షా 70వేల మంది ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకి ట్రీట్మెంట్ పొందుతున్నారు.