రెండు తలల శిశువు

హైదరాబాద్: వైద్య రంగంలో ఓ అరుదైన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. 5 నెలల గర్భంతో ఉన్న మహిళ శరీరం నుంచి రెండు తలలతో ఉన్న శిశువును డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఇలా ఒకే శరీరం రెండు తలలతో ఉండటాన్ని వైద్య పరిభాషలో బైసెఫాలిక్ హైడ్రో సెఫాలస్ అని పిలుస్తారు. ఇది వైద్య చరిత్రలో చాలా అరుదైన ఘటన అని, కోటి మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి జన్యుపరమైన సమస్య వస్తుందని వైద్యులు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహేశ్, సుజాత (27) దంపతులు ముషీరాబాద్ బాపూజీ నగర్‌లో నివాసముంటున్నారు. మహేశ్ డ్రైవర్ కాగా, సుజాత గృహిణి. సుజాత గర్భం దాల్చడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని డంగోరియా ఆస్పత్రిలో డాక్టర్ సాయిలీలా దగ్గర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మూడో నెలలో స్కానింగ్ చేసుకోవాలని సూచించినా కుదరకపోవడంతో చేయించుకోలేదు. ప్రస్తుతం ఐదో నెల కావడంతో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు డాక్టర్ దగ్గరికి వెళ్లారు.
డాక్టర్ సూచన మేరకు శివాని స్కానింగ్ సెంటర్‌లో స్కానింగ్ చేయించుకునేందుకు వెళ్లారు. స్కానింగ్ రిపోర్టులో శిశువు పరిస్థితి చూసిన డాక్టర్లు తక్షణమే ఆపరేషన్ చేసి తల్లి గర్భం నుంచి శిశువును బయటకు తీయాలని, లేకుంటే తల్లి ప్రాణానికే ముప్పు ఉందని చెప్పడంతో శనివారం ఆపరేషన్ చేసి ఆ శిశువును బయటకు తీశారు. కాగా, రెండు తలలతో ఉన్న ఈ శిశువు రెండు చేతులు, రెండు కాళ్లతో మిగతా శరీరం మొత్తం మాములుగానే ఉంది. మెడ మీదనే రెండు తలలు ఉన్నాయి. మగ శిశువుగా గుర్తించారు. శిశువు జన్యుపరమైన లోపాలతో జన్మించాడని వైద్యులు తెలిపారు. గర్భంలోనే శిశువు మరణించి ఉంది. శిశువు వయసు 22 వారాలు ఉంటుంది. 38 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్నా ఇలాంటి కేసు తమకు ఎప్పుడూ ఎదురు కాలేదని డాక్టర్ సాయిలీలా, డంగోరియా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దేవయాని తెలిపారు.