సెల్ ఫోన్ వాడుతున్నారా? : మీ తల, మెడ జాగ్రత్త!

సెల్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఆరోగ్య సమస్యలను ఆహ్వానించినట్టే. మొబైల్ ఫోన్ అనేది ప్రతిఒక్కరికి నిత్యావసరంగా మారిపోయింది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడేవారిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. నిద్రలేసిన దగ్గర నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకు చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే.. ఎక్కడికి వెళ్లినా మొబైల్ లేకుండా వెళ్లలేని స్థితికి చేరుకున్నారు.
దీని కారణంగా తలెత్తే సమస్యలు నెమ్మదిగా అనారోగ్యానికి దారితీస్తాయి. తలను కిందికి దించి గంటల తరబడి సెల్ ఫోన్ స్ర్కీన్ వైపు అలానే చూస్తుండిపోవడం వంటివి చేస్తుంటారు. సెల్ ఫోన్ ఎక్కువ సమయం వాడేవారిలో తల, మెడ గాయాలైన ఘటనలు ఎన్నో ఉన్నాయి.అమెరికాలోని పరిశోధక బృందం 100 ఆస్పత్రుల్లో నుంచి డేటా ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది. సెల్ ఫోన్ కారణంగానే తల, మెడ సంబంధిత సమస్యలు అధికమైనట్టు తెలిపింది. గత 20 ఏళ్లలో 2వేల 500 మంది ప్రజలు ఈ సెల్ భూతం బారిన పడినట్టు రీసెర్చర్లు తెలిపారు.
13ఏళ్ల వయస్సు కన్నా ఎక్కువే :
పరిశోధకుల డేటా ప్రకారం.. 40 శాతం మంది ఇంట్లోనే ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. డైరెక్ట్ లేదా మెకానికల్ ఇంజ్యూరీ (సెల్ ఫోన్ కు అతుక్కుపోవడం లేదా బ్యాటరీ పేలిన ఘటనకు సంబంధించి) 47శాతం మంది ఉన్నారు. రోడ్డుపై సెల్ ఫోన్ స్ర్కీన్ చూస్తూ నడుస్తూ గాయాలపాలైన వారిలో 53 శాతం మంది ఉన్నారు. సెల్ ఫోన్లో మెసేజ్ చేస్తూ నేరుగా గాయాలపాలైన వారిలో ఎక్కువ మంది 13 ఏళ్ల వయస్సు కంటే ఎక్కువ ఉన్నారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినవారిలో 10 శాతం మంది గాయపడినట్టు డేటా తెలిపింది. ఫోన్లో చూస్తూ నడుస్తూ గాయపడినవారిలో 7 శాతం, మెసేజ్ చేస్తూ గాయపడినవారిలో 1 శాతం మాత్రమే ఉన్నట్టు అధ్యయనం తెలిపింది.
ఫోన్ కారణంగా గాయపడినవారిలో 94 శాతం మంది ఎలాంటి చికిత్స అవసరం లేకపోవడం లేదా అత్యవసర చికిత్స తీసుకున్న అనంతరం డిశ్చార్చి అయినవారు ఉన్నారు. ఈ కేసుల్లో సగానికి పైగా చర్మం కమిలిపోవడం, తెగిన గాయాలు 18 శాతం ఉండగా, వీటిలో కొన్ని ప్రాణాంతక, మెదడుకు గాయమై కోమంలోకి వెళ్లిపోయిన కేసులు ఉన్నాయి.
2007 నుంచి ఈ క్రమంగా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. అదే సమయంలో ఆపిల్ ఐఫోన్ కూడా మార్కెట్లో వచ్చింది. గత రెండు దశాబ్దకాలంలో సెల్ ఫోన్ కారణంగా జరిగిన ప్రమాదాల్లో 76వేల మంది ఎక్కువగా హెడ్, నెక్ ఇంజ్యూరీ సమస్యలతోనే బాధపడుతున్నట్టు డేటా అంచనా వేసింది. ప్రతి ఏడాదిలో లక్ష మందిలో సెల్ ఫోన్ వాడేవారిలో రెండు కంటే తక్కువగా గాయాలు అవుతున్నాయి.
పిల్లల విషయంలో జాగ్రత్త :
సెల్ ఫోన్ నుంచి చిన్న పిల్లలను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం వారి తల్లిదండ్రులపైనే ఉంది. సెల్ ఫోన్ అనేది ఒక నిత్యవసర వస్తువే అయినప్పటికీ దీని కారణంగా కలిగే ప్రయోజనాల కంటే ఆరోగ్య పరంగా తలెత్తే సమస్యలు అధికంగా ఉన్నట్టు పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. సెల్ ఫోన్ కారణంగా పిల్లల్లో మాత్రమే కాదు.. పెద్దల్లోనూ ఇదే సమస్య అధికంగా కనిపిస్తోంది. సెల్ ఫోన్ కారణంగా వీపు వెనుకపైభాగం, మెడ నొప్పి వంటి సమస్యలు అధికమయ్యాయి. అంతేకాదు.. కేన్సర్ ముప్పు కూడా పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు.
జీవనశైలిలో సెల్ ఫోన్ అనేది అవసరాలు తీర్చేదిలా ఉండాలే తప్ప అదే వ్యసనంగా మారకూడదు. ప్రత్యేకించి నడిచేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, పరిగెత్తేటప్పుడు లేదా మరి ఏదైనా పనిచేసే సమయంలో సెల్ ఫోన్ దూరంగా ఉంచటమే ఎంతో ఉత్తమం.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అంటున్నారు పరిశోధకులు..