ఆర్టీసీని ప్రైవేటు చేసే ప్రయత్నం – అశ్వత్ధామ రెడ్డి

  • Published By: madhu ,Published On : October 6, 2019 / 03:17 PM IST
ఆర్టీసీని ప్రైవేటు చేసే ప్రయత్నం – అశ్వత్ధామ రెడ్డి

Updated On : October 6, 2019 / 3:17 PM IST

ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామమ రెడ్డి. ఎట్టి పరిస్థితిల్లోనూ సమ్మెను కొనసాగిస్తామని, ఇంకా ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. 2019, అక్టోబర్ 06వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. 

తమ సమ్మెను చీల్చాలని ప్రభుత్వం పకడ్బందిగా ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. అందరూ తమకు సహకరించాలని కోరారు. సమ్మెకు రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతిచ్చాయన్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం తాము చేస్తున్న పోరాటాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. సమ్మె సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా బస్సులను తిప్పుతున్నట్లు ప్రభుత్వం చెబుతోందని..ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలని, దొంగ లెక్కలు చెప్పకుండా వాస్తవ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారాయన.

50 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని, ప్రభుత్వం చేస్తున్న చర్యలను అన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాలని పిలుపునిచ్చారు. మరోవైపు వీరు చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశం నాలుగు గంటలకు పైగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.