తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్.. పాతబస్తీలో పటిష్ట బందోబస్తు, నిరసనలు ర్యాలీలపై నిషేధం

  • Published By: naveen ,Published On : September 30, 2020 / 11:47 AM IST
తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్.. పాతబస్తీలో పటిష్ట బందోబస్తు, నిరసనలు ర్యాలీలపై నిషేధం

Updated On : September 30, 2020 / 11:59 AM IST

babri masjid demolition verdict: బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు దృష్ట్యా తెలంగాణ పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. సున్నితమైన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా పాతబస్తీలో పటిష్టమైన బందోబస్తు పెట్టారు. రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టుల్లో పోలీసులు అదనపు భద్రత ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

28ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత తీర్పు:
28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వంటి బీజేపీ అగ్రనేతలు, సంఘ్‌పరివార్‌ నేతలు, ప్రస్తుత రామాలయ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ నిందితులుగా ఉండడంతో ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. తీర్పు సమయంలో నిందితులంతా కోర్టులో హాజరు కావాలని జడ్జి ఆదేశించారు.

ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు కాగా.. విచారణ సమయంలో వీరిలో 17 మంది మరణించారు. ప్రస్తుతం 32 మంది ఉన్నారు. వీరిలో 21 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. పవన్‌ పాండే, సాధ్వి రితంబరా, వినయ్‌ కటియార్‌, ధరమ్‌దాస్‌, వేదాంతి, లల్లూసింగ్‌, చంపత్‌ రాయ్‌ తదితరులు కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. బాబ్రీ కేసు తీర్పు నేపథ్యంలో లక్నో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

అసలేం జరిగిందంటే?
1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఇది తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్‌సింగ్‌ రాజీనామా చేయడం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం వెంటవెంటనే జరిగిపోయాయి. అద్వానీ, మురళీమనోహర్‌ జోషి తదితర బీజేపీ నేతలు, సంఘ్‌పరివార్‌ నేతలు రెచ్చగొట్టడం వల్లే ఈ సంఘటన జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూల్చివేతను అడ్డుకోలేకపోయిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా విమర్శలు ఎదుర్కొంది. తొలుత స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినా తర్వాత కేసు సీబీసీఐడీ, ఆ తర్వాత సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. మధ్యలో ముఖ్యనేతలపై నేరపూరిత కుట్ర అభియోగాలను సీబీఐ న్యాయస్థానం తొలగించినా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ అభియోగాలను కొనసాగించారు. సీబీఐ మొత్తం 49 మందిని నిందితులుగా చేర్చగా కేసు విచారణలో ఉండగానే 17 మంది మరణించారు.

నిందితులు వీరే:
మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.అద్వానీ(92)
కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి(86)
ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌
మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి
సాధ్వి రితంబర
వినయ్‌ కటియార్
పవన్‌ పాండే

సుధీర్‌ కక్కర్
సతీశ్‌ ప్రధాన్
రాంచంద్ర ఖత్రి
సంతోశ్‌ దుబె
రాం విలాస్‌ వేదాంతి
ప్రకాశ్‌ శర్మ
గాంధీ యాదవ్
జై భాన్‌ సింగ్
లల్లు సింగ్
కమలేశ్‌ త్రిపాఠి
బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌
రాంజీ గుప్తా
మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్
చంపత్‌ రాయ్
సాక్షి మహారాజ్

వినయ్‌ కుమార్‌ రాయ్
నవీన్‌ భాయ్‌ శుక్లా
ధర్మదాస్
జై భగవాన్‌ గోయల్
అమర్‌నాథ్‌ గోయల్
విజయ్‌ బహదూర్‌ సింగ్
ఆర్‌.ఎం.శ్రీవాస్తవ
ధర్మేంద్ర సింగ్‌ గుర్జార్
ఓం ప్రకాశ్‌ పాండే
ఆచార్య ధర్మేంద్ర.

మరణించిన నిందితులు:
బాలా సాహెబ్‌ ఠాక్రే, అశోక్‌ సింఘాల్‌, గిరిరాజ్‌ కిశోర్‌, పరమహంస రామచంద్ర దాస్‌, వినోద్‌ కుమార్‌ వత్స్‌, రాం నారాయణ్‌ దాస్‌, డి.బి.రాయ్‌, లక్ష్మీ నారాయణ్‌ దాస్‌, హర్‌గోవింద్‌ సింగ్‌, రమేశ్‌ ప్రతాప్‌ సింగ్‌, దేవేంద్ర బహదూర్‌, విష్ణుహరి దాల్మియా, మోరేశ్వర్‌ సావే, మహంత్‌ అవైద్యనాథ్‌, మహామండలేశ్వర్‌ జగదీశ్‌ ముని మహారాజ్‌, వైకుంఠ్‌ లాల్‌ శర్మ, సతీశ్‌ కుమార్‌ నాగర్‌.

ఆ రోజు ఏం జరిగింది?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 1992 డిసెంబర్ 6న కరసేవ నిర్వహించాలని నిర్వాహకులు తలపెట్టారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కరసేవకులు అయోధ్య చేరుకున్నారు. అయితే పరిస్థితి అదుపు తప్పింది. బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ సంఘటనపై అదే రోజు ఫైజాబాద్‌లోని రామ జన్మభూమి పోలీస్‌ స్టేషన్‌లో తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

లక్షల మంది కరసేవకులు నిందితులని ఈ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నా ఎవరి పేరూ నమోదు చేయలేదు. ఆ తర్వాత పది నిమిషాలకే రామజన్మ భూమి పోలీస్‌ పోస్ట్‌ ఇన్‌ఛార్జి గంగాప్రసాద్‌ తివారి ఫిర్యాదు మేరకు రెండో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను దర్యాప్తు కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. రెండో రోజున ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేశారు. సీబీసీఐడీ కేసును దర్యాప్తు చేసి అభియోగపత్రం దాఖలు చేసింది.