బేటీ బచావో ఏదీ : ఆంధ్ర, రాజస్థాన్‌లో తగ్గిపోతున్న చిట్టితల్లులు

యావత్ భారత్ దేశమంతటా మహిళా శిశువులను కాపాడండి.. సంరక్షించండి. అంటూ ఆర్తనాదాలు చేస్తున్నా ఏ మాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. 2007 నుంచి 2016ల మధ్య కాలంలో లింగ నిష్పత్తి మరీ దారుణంగా తగ్గిపోయిందట. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఈ వ్యత్యాసం చాలా ఘోరంగా కనిపిస్తోంది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నుంచి సమాచారాన్ని అందుకున్న రిజిష్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో మహిళా శిశు జననాల రిజిస్ట్రేషన్ పూర్తిగా తగ్గిపోతుందని తెలిపింది.
ఈ సర్వేలో ప్రతి వెయ్యి మంది మగ శిశువుల జననాలకు దేశంలో ఎక్కడా లేనంతగా దక్షిణాది రాష్టాల్లోనే వైఫల్యం కనిపిస్తుందంటూ సానుభూతి ప్రకటించింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లలో దయనీయంగా 806గా ఉందట. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆంధ్ర, తెలంగాణలో ఈ వృద్ధిలో పెద్దగా తేడాలేం కనిపించడంలేదట.
ఈ జాబితాలో కింద నుంచి తమిళనాడు 935 నుంచి 840 పడిపోయి ఆరో స్థానంలో ఉంది. 2007 నుంచి 2016వరకూ చేసిన సర్వే ప్రకారం.. వృద్ధి రేట్లు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 974 నుంచి 806కు, కర్ణాటక 1004నుంచి 896కు, తమిళనాడు 935నుంచి 840కు, ఒడిశా 919 నుంచి 858కు, ఉత్తరాఖాండ్ 869 నుంచి 825కు దిగజారిపోయింది.
పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలు గతంలో తక్కువ వృద్ధి రేటు ఉన్న రాష్ట్రాలుగా ఎంపికకాగా, వాటిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది. ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో భారీగా వృద్ధి కనిపించింది. ఢిల్లీలో 848 నుంచి 902కు, అస్సాంలో 834 నుంచి 888కు పెరిగింది. మిగిలిన పశ్చిమ బెంగాల్, ఒడిశఆ, జమ్మూ కశ్మీర్, గోవాలు ఇంకా తగ్గుతూనే ఉన్నాయి. జననాలతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలోనూ విఫలమవడం ఈ భారీ తేడాకు కారణమనే చెప్పాలి.
కేరళలో ప్రతి వంద మంది బాలికలకు 105మంది బాలుర జననాలు జరుగుతున్నాయి. అంటే లింగ నిష్పత్తి ప్రకారం అక్కడ 952గా ఉంది. అదే విషయం చత్తీస్‌ఘడ్‌లో మాత్రం 980గా అత్యధికంగా ఉంది.