హైటెక్ సిటీ వెళ్లేవారికి రిలీఫ్ : అందుబాటులోకి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్
జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఫ్లైఓవర్లో మరొకటి అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి.

జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఫ్లైఓవర్లో మరొకటి అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి.
జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఫ్లైఓవర్లో మరొకటి అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర చేపట్టిన ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. ఖాజాగూడ సైడ్ నుంచి మైండ్ స్పేస్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీగా ఉండేందుకు ఫ్లైఓవర్ ను నిర్మించారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే దీన్ని ప్రారంభించాలని రాష్ట్రం ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఫ్లైఓవర్ ను (నవంబర్ 4, 2019) మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి దీపావళికే ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలని అనుకున్నా కొన్ని పనులు మిగిలిపోవడంతో వాయిదా పడింది. కిలోమీటరు పొడవున మూడు లేన్లుగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక మెహిదీపట్నం నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే వారికి ఎంతో సమయం కలిసొస్తుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. హైటెక్ సిటీ వైపు వెళ్లేవారు కూడా జంక్షన్ దగ్గర ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు.
ఎస్సార్‌డీపీ పనుల 4వ ప్యాకేజీలో భాగంగా బయోడైవర్సిటీ దగ్గర రెండు ఫ్లైఓవర్ల అంచనా వ్యయం రూ.69.47 కోట్లు కాగా.. ఇది వరుసగా రెండో ఫ్లైఓవర్. గచ్చిబౌలి వైపు నుంచి ఖాజాగూడ జంక్షన్ వైపు వెళ్లే మొదటి వరుస ఫ్లైఓవర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఐటీ కారిడార్ మార్గంలో ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు చేపట్టిన పనుల్లో అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ జంక్షన్ అండర్‌పాస్, మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే.
వీటివల్ల ట్రాఫిక్ చిక్కులు తగ్గాయి. కొత్త ఫ్లైఓవర్‌తో మరికొంత సౌలభ్యం కలుగనుంది. బయోడైవర్సిటీ దగ్గర మొదటి వరుస ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తయితే జంక్షన్‌లో ట్రాఫిక్ చిక్కులుండవని అధికారులు అంటున్నారు. మరో ఆరునెలలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.