శ్రీరామున్ని గుండెల్లో కొలుచుకోండి.. బాధగానే ఉంది కానీ తప్పదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) దేశంలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలోనే తిరుమల దేవస్థానం విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఆంక్షలు విధిస్తూ.. నిర్ణయం తీసుకుంది.
ఘాట్ రోడ్ మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకోగా.. ఎగువ ఘాట్ రోడ్‌లో వాహన రాకపోకలను నిషేధించారు. తిరుమల కొండపై ఉన్న భక్తులను వెంటనే కిందకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. భక్తులు కిందికి వెళ్లేందుకు దిగువ ఘాట్ రోడ్ తెరిచి ఉంచారు.
తిరుమల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని చిలుకూరి బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్ సమర్ధించారు. తిరుమలతో పాటు ప్రధాన ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగినదని అన్నారు. ఈ శ్రీరామ నవమికి భక్తులు ఆ రామున్ని తమ గుండెల్లో కొలుచుకోవాలని ఆయన అన్నారు.
వచ్చే ఏడాది శ్రీరామనవమి నాడు రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలు నిర్వహించుకుందాం అని ఆయన భక్తులకు సూచనలు చేశారు. చిలుకూరు ఆలయంలో భక్తుల దర్శనం నిలిపివేయడం తనకు బాధగానే ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోక తప్పట్లేదని రంగారాజన్ తెలిపారు.
Also Read | ఏపీలో మూడుకు చేరిన కరోనా కేసులు