ప్రభుత్వ పథకాల అమలుకే మొదటి ప్రాధాన్యత : కలెక్టర్లకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు
సీఎం కేసీఆర్...జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం రూపొందించిన పథకాల అమలే ప్రాధాన్యతగా పనిచేయాలని సూచించారు.

సీఎం కేసీఆర్…జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం రూపొందించిన పథకాల అమలే ప్రాధాన్యతగా పనిచేయాలని సూచించారు.
ప్రభుత్వం రూపొందించిన పథకాల అమలే ప్రాధాన్యతగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అధికారుల భారీ బదిలీల అనంతరం తొలిసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించిన కేసీఆర్… భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాల్ని సమర్థవంతంగా అమలు చేయకపోతే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో దాదాపు ఎన్నికలన్నీ పూర్తికావడంతో పాలనలో తన మార్క్ చూపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అవుతున్నారు. పారదర్శకమైన, అవినీతిరహిత పాలన అందించేందుకు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రగతి భవన్లో 11 గంటలపాటు కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ భేటీలో కేసీఆర్ పలు అంశాలపై కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు చేశారు.
పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమం
ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పట్టణాల్లో ఈ కార్యక్రమానికి వార్డులవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించి… ఆ వార్డుల బాధ్యతల్ని సదరు అధికారులకే అప్పగించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లకు కోటి రూపాయల నిధులను కేటాయించారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల్ని వివరించారు. పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో మున్సిపల్ సమ్మేళనాలు నిర్వహించి చైర్మన్, మేయర్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను పిలిచి శిక్షణ ఇవ్వాలని సూచించారు. దానికి ముందే వార్డుల వారీగా కమిటీల్ని నియమించాలని ఆదేశించారు. పట్టణాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్ని గుర్తించి ప్రజల అవసరం కోసం వినియోగంలోకి తేవాలన్నారు.
రెండు వారాల్లో పంచాయతీరాజ్ సమ్మేళనాలు
గ్రామాల రూపురేఖలు మార్చేందుకు నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించామని, ఫలితాలు రాకపోతే చూస్తూ ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇందుకు కలెక్టర్లు, మంత్రులే బాధ్యత వహించాలన్నారు. కలెక్టర్లకు సాయంగా ఉండేందుకు అదనపు కలెక్టర్ నియమించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. స్థానిక సంస్థల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అడిషనల్ కలెక్టర్లను నియమించామన్నారు. రెండు వారాల్లో పంచాయతీరాజ్ సమ్మేళనాలు నిర్వహించి… వాటికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించి గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల్ని వివరించాలన్నారు. అలాగే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్ని తాను ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్ లో కాలుష్య నివారణకు ప్రణాళిక
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే రోజుల్లో కాలుష్యం పెరిగే అవకాశమున్నందున విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. నగరంలో దాదాపు లక్షా 60 వేల ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉందని… వాటిలో అడవులు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తీసుకోవాలన్నారు. నగరంలో కాలుష్య నివారణకు ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయడంతో పాటు ప్రణాళికాబద్ధంగా డీజిల్ వాహనాల తగ్గించి ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్నా… అక్షరాస్యతలో మాత్రం ఆశించిన స్థానంలో లేమని… అందుకే నిరక్షరాస్యతను పారదోలేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సీఎం సూచించారు.
కొత్త రెవెన్యూ చట్టం
కొత్త రెవెన్యూ చట్టంలోని ప్రతిపాదనల్ని కలెక్టర్‌కు వివరించిన కేసీఆర్… వారి అభిప్రాయాల్ని కూడా తీసుకున్నారు. త్వరలో కొత్త చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని చెప్పారు. పాలనలో అధికారులే కీలకమని… అన్ని అంశాలపై అవగాహన పెంచుకుని… ప్రజలకు మేలు జరిగేలా అధికారులు వ్యవహరించాలని సీఎం సూచించారు.