పేదోడి బువ్వకు కష్టాలు : రేషన్ డీలర్ల సమ్మె బాట

  • Published By: madhu ,Published On : February 16, 2019 / 02:15 AM IST
పేదోడి బువ్వకు కష్టాలు : రేషన్ డీలర్ల సమ్మె బాట

దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టనున్నారు. ఒకే విధమైన పారితోషకం..లేదా కమిషన్ కోసం వీరు ఆందోళన చేపడుతున్నారు. అందులో భాగంగా మార్చి 1వ తేదీ నుండి సమ్మెలోకి దిగబోతున్నారు. డీలర్లకు నెలకు రూ. 50వేల వేతనం లేని పక్షంలో క్వింటాల్ ధాన్యానికి రూ. 300 కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర డీలర్ల సంఘం కేంద్ర కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఇక హైదరాబాద్‌లో ఫిబ్రవరి 16వ తేదీ శనివారం రాష్ట్ర కమిటీ సమావేశం కానుంది. 

2015 అక్టోబర్ 1వ తేదీ నుండి జాతీయ ఆహార భద్రత చట్టం అమలవుతోంది. క్వింటాల్ బియ్యానికి రూ. 70 కమీషన్ ఇస్తోంది. ఎన్నికలకంటే ముందు వరకు కమీషన్ కేవలం రూ. 20 మాత్రమే ఉండగా..దీనిని ఆగస్టు నెలలో రూ. 70కి పెంచారు. రూ. 500 కోట్ల బకాయిలలో కొన్ని చెల్లించినా మిగతావి పెండింగ్‌లో ఉంచారు. ఒక్కో రేషన్ దుకాణానికి నెలకు సగటున రూ. 3,700 ఆదాయం వస్తోందని అంచనా. కొన్ని దుకాణాలకు మాత్రం రూ. 6 వేల వరకు వస్తుందని తెలుస్తోంది. ఈ డబ్బుల్లోనే షాపు అద్దె, విద్యుత్ ఛార్జీలు, ఇతర నిర్వాహణ ఖర్చులు చెల్లించడం సాధ్యం కావడం లేదని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు.

కమీషన్ బదులుగా కనీస వేతనం చెల్లించాలని డీలర్ల వాదన. ఒకవేళ ఇది కాకుంటే క్వింటాల్‌పై రూ. 300 కమీషన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. సమ్మె నోటీసులిచ్చిన కేంద్ర కమిటీ మార్చి నుండి సమ్మెలోకి దిగడానికి సిద్ధమౌతోంది. రాష్ట్రంలో సమ్మె అంశంపై కార్యచరణ రూపొందించడానికి రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం సిద్ధమౌతోంది. మరి వీరు సమ్మెలోకి దిగకుండా చర్యలు తీసుకంటుందా ? లేదా ? అనేది చూడాలి.