తెలంగాణలో వర్షాలు..వడగాలులు

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అయితే ఈ ఎండల నుండి కొంత ఉపశమనం పొందే వీలుంది. ఎందుకంటే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం వర్షాలు లేని ప్రాంతంలో వడగాలులు వీస్తాయని వెల్లడించారు.
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తీవ్రత అధికమయ్యింది. మే 1వ తేదీ నాటికి వాయువ్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనిపై సోమవారం స్పష్టత వస్తుందని వెల్లడించారు. తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పెద్దగా ఉండదని, కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్నారు. వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కోస్తాంధ్రలో ఒక మాదిరి వర్షాలు కురుస్తాయన్నారు.
ఫోని తుఫాన్ తీరంవైపుగా దూసుకొస్తోంది. తీరంపై విరుచుకుపడేందుకు వాయు వేగంతో పరుగులు తీస్తోంది. ఇది అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉండగా.. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమమయ్యింది. గంటకు 10 కిమీ వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది.
ఇది దిశ మార్చుకుని తూర్పు ఈశాన్య దిశగా పయనించి మయన్మార్, బంగ్లాదేశ్ వైపు మళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఫోని తుపాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 140 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో.. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం, ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం తమిళనాడు, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయి.