24 నుంచి హైదరాబాద్ లో బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ హైదరాబాద్ మహా నగరంలో మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో సెప్టెంబర్ 24 మంగళవారం నుంచి బతుకమ్మ చీరలు అర్హులైన మహిళలకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో చీరల పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 24 నుంచి 30వ తేదీ నెలాఖరు వరకు చీరల పంపిణీ ప్రక్రియ కొనసాగనుందని తలసానితెలిపారు.
జీహెచ్‌ఎంసీకి 15 లక్షల 40 వేల చీరలు మంజూరయ్యాయనీ, జీహెచ్‌ఎంసీ, పౌరసరఫరాల శాఖ సమన్వయంతో చీరల పంపిణీ జరుగుతుందని మంత్రి వివరించారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో బతుకమ్మ చీరల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం పట్ల మహిళలు పూర్తి సంతృప్తిగా ఉన్నారు.
దసరా పండుగ రోజున ఆడపడుచులందరూ కొత్త చీరలు ధరించి, పండుగను సంతోషంగా జరుపుకోవాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ చీరలు తయారు చేసేందుకు సిరిసిల్ల నేతన్నలకు పని అప్పగించి ప్రభుత్వం వారికి కూడా ఉపాధి కల్పిస్తోంది.