మూడంచెల భద్రత : స్ర్టాంగ్‌ రూమ్స్‌లో ఈవీఎంలు భద్రం

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 02:48 PM IST
మూడంచెల భద్రత : స్ర్టాంగ్‌ రూమ్స్‌లో ఈవీఎంలు భద్రం

Updated On : April 12, 2019 / 2:48 PM IST

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యాలను తేల్చే ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్‌ వైపు అందరి చూపు మళ్లింది. 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఫలితాలకు 42 రోజుల గడువు ఉండటంతో పోలీసులు భద్రతపై దృష్టిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియెజకవర్గాల్లో స్ట్రాంగ్  రూమ్స్‌ ఏర్పాటుచేసి కేంద్ర, రాష్ట్ర బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు.

ఎన్నికల్లో తుది ఘట్టమైన కౌంటింగ్‌కు మరో 42 రోజుల గడువు ఉండటంతో పోలీసు బందోబస్తు డ్యూటీ స్ట్రాంగ్ రూమ్స్‌ దగ్గరికి మారింది. రాష్ట్రవ్యాప్తంగా 38 స్ట్రాంగ్ రూమ్స్‌లలో ప్రస్తుతం ఈవీఎంలను భద్రపరిచారు. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్‌ వద్ద 5 వేల మంది పోలీస్ బలగాలతో పహారా నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీ జితేందర్ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్‌ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్ట్రాంగ్ రూమ్స్‌ వద్ద సీసీటీవీ కెమెరాలతో గస్తీ కాస్తున్నారు పోలీసులు.

మరోవైపు స్ట్రాంగ్‌ రూమ్‌లకు కేవలం ఒకే ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి స్ర్టాంగ్ రూమ్‌కు డబుల్‌ లాక్‌ సిస్టం ఏర్పాటు చేసి ఇన్‌చార్జ్‌, మెజిస్టీరియల్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్టాంగ్ రూమ్స్‌పై నిఘాని పట్టిష్టం చేస్తూ..  ప్రతి జిల్లాకు ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. స్ర్టాంగ్ రూమ్స్‌ ఉన్న పరిసర ప్రాంతాలకు ఎవ్వరినీ అనుమతించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతీ స్ర్టాంగ్ రూమ్‌ దగ్గర నిరంతరం పవర్ ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు అదనంగా జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

జంట నగరాల్లో  దాదాపు 14 ప్రాంతాల్లో స్ర్టాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇక సెంట్రల్ జోన్ పరిధిలో 7 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వ ప్రసాద్. రాష్ట పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో పహారా నిర్వహిస్తున్నామన్నారు. మే 23 ఫలితాలు వెలువడిన అనంతరం ఈవీఎం, వీవీ ప్యాట్‌లను తిరిగి ఈసీ స్వాధీనం చేసుకునేంత వరకు భద్రత కల్పిస్తామన్నారు. 

అభ్యర్థుల భవితవ్యాలను తేల్చే ఈవీఎంల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. మరో 40 రోజుల్లో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టింది.