ఏ పార్టీలో చేరుతారో : ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ రాజీనామా చేశారు. మార్చి 22వ తేదీ శుక్రవారం రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపారు వివేక్. పార్లమెంట్ ఎన్నికల్లో లోక్ సభ సీటును వివేక్ ఆశించారు. అయితే..ఈయన్ను కాదని..వెంకటేశ్ నేతకానికి గులాబీ బాస్ కేసీఆర్ టికెట్ ఇచ్చేశారు. దీనితో వివేక్ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.
దీనిపై వివేక్ రెస్పాండ్ అయ్యారు. 2019లో టికెట్ ఇస్తామని చెబితేనే టీఆర్ఎస్‌లోకి రావడం జరిగిందన్నారు. అయితే..ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తనకు పెద్దపల్లి టికెట్ ఇవ్వలేదని చెప్పారు. అయినా..తాను మాత్రం పెద్దపల్లి ప్రజలకు ఎప్పుడూ సేవ చేస్తూనే ఉంటానన్నారు.
పెద్దపల్లి ఎంపీ సీటుకు టీఆర్ఎస్‌లో వివేక్..వెంకటేశ్ నేతకాని మధ్య పోటీ ఉండేది. ఇక్కడ వివేక్ కు సీటు ఇవ్వొద్దని కేసీఆర్‌కు పెద్దపల్లి లోక్ సభ పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లు తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కొందరు టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమి కోసం మాజీ ఎంపీ వివేక్ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. చివరకు వెంకటేశ్ నేతకాని ఎంపీ టికెట్ ఇచ్చి బీఫాం ఇచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి బాల్క సుమన్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటేశ్ నేత పోటీ చేసి ఓడిపోయారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివేక్..అక్కడ ఇమడలేక 2016 జూన్‌లో అతని సోదరుడు మాజీ మంత్రి వినోద్‌తో కలిసి TRSలో చేరారు. 2016 నవంబర్ 30న కేసీఆర్..రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. ముందస్తు ఎన్నికల్లో వినోద్‌కు చెన్నూరు నుంచి టీఆర్‌ఎస్ టిక్కెట్ దక్కలేదు. వివేక్ రాజీనామాతో సరిపెడుతారా ? లేక ఇతర పార్టీల్లోకి జంప్ అవుతారా ? చూడాలి.