సినిమా కథ లాంటిదే: కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్

  • Published By: vamsi ,Published On : April 4, 2019 / 02:51 AM IST
సినిమా కథ లాంటిదే: కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్

Updated On : April 4, 2019 / 2:51 AM IST

సినిమాల్లో చూసే కథలు అప్పుడప్పుడూ నిజజీవితంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా అన్నదమ్ముల అనుబంధం సినిమా కథ వంటిదే. అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్‌కు చెందిన మౌలాలిలోని నవోదయనగర్‌లో నివాసముండే సుసన్నా, అబ్బాస్‌ దంపతులకు దీపక్‌(22), దినేశ్‌జీనా లిమా(21) అనే ఇద్దరు కుమారులు. ఎనిమిదేళ్ల క్రితం అంటే 2011లో వాళ్ల వయస్సు 14ఏళ్లు, 13ఏళ్లు ఉంటాయి. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు క్రికెట్ ఆడుకుంటూ గొడవ పెట్టుకున్నారు. గొడవలో అలిగిన దినేశ్‌ ఇంట్లో చెప్పకుండా పారిపోయాడు. కొడుకు కనిపించట్లేదని, కుషాయిగూడ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంత వెతికినా కూడా అతని జాడ దొరకలేదు. దినేష్ పారిపోయిన రోజే సికింద్రాబాద్‌కు చేరుకుని రైలులో పంజాబ్‌లోని అమృత్ సర్‌కు చేరుకున్నాడు.

అమృతసర్‌ దగ్గరలో రాణాకలా అనే గ్రామంలో దినేష్‌ను సుక్రాజ్‌సింగ్‌ అనే లాండ్‌లార్డ్‌  చేరదీశాడు. అప్పటి నుంచి అక్కడే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. 2015లో ఒకసారి తల్లిని, అన్నను చూడాలని సికింద్రాబాద్‌కు వచ్చిన దినేష్.. ఇంటికి వెళ్లేందుకు ధైర్యం చాలక తిరిగి పంజాబ్‌లో తాను పనిచేస్తున్న చోటుకే వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే 2018లో అతడు దినేశ్‌ జీనా లీమా పేరుతో ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు.

ఇక్కడ బీ.టెక్ పూర్తి చేసుకున్న అన్న దీపక్.. తమ్ముడి ఆచూకీ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. ఫేస్‌బుక్‌లో తన తమ్ముడి పేరుతో ప్రొఫైల్‌‌లను వెతికాడు.  అందులో తమ్ముడి ఫొటో రావడంతో వెంటనే పోలీసులకు గత నెలలో సమాచారం ఇచ్చారు. సైబర్‌ క్రైం పోలీసుల సహకారం ఆధారంగా దినేశ్‌ ఆచూకీ పట్టుకుని హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు. 8ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు తిరిగిరావడంతో ఆ కుటుంబం ఆనందంగా ఉంది.