జనవరి 17 నుంచి తెలంగాణ అసెంబ్లీ

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 12:30 PM IST
జనవరి 17 నుంచి తెలంగాణ అసెంబ్లీ

హైదరాబాద్ : తెలంగాణ తొలి శాసన సభ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జనవరి 17 నుంచి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. నాలుగు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. జనవరి 17న ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనవరి 18న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 19వ తేదీన ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. 20 వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ ఉంటుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది గతంలో బలమైన ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా బలహీనపడింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప కాంగ్రెస్ లోని హేమాహేమీలు ఓడిపోయారు. తమ ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే జానారెడ్డి, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డి.కె అరుణ, సంపత్ కుమార్, వంశీచందర్ రెడ్డి ఓడియారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, లక్మణ్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్, బీజేపీలకు కష్టకాలంగా ఉంది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గతంలో ప్రాతినిథ్యం ఉన్న వామపక్షాలకు తొలిసారి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. 

2018, సెప్టెంబర్ 6వ తేదీన కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. డిసెంబర్ 7వ తేదీన రాష్ట్రంలోని 119 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.