పార్టీ మారినా ఫ్లెక్సీలో వాళ్లే

  • Published By: madhu ,Published On : April 19, 2019 / 02:05 PM IST
పార్టీ మారినా ఫ్లెక్సీలో వాళ్లే

Updated On : April 19, 2019 / 2:05 PM IST

వారంతా ఒకప్పుడు ఆపార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. వారి కమిట్‌మెంట్‌ చూసి పార్టీ అధిష్టానం కూడా పదవులు కట్టబెట్టింది. అయితే ఇటీవల వారంతా రాజకీయ భవిష్యత్తు నిచ్చిన పార్టీని కాదని.. మరో పార్టీలోకి జంప్‌ అయ్యారు. అయినా.. వారిమీదున్న అభిమానమో.. లేక ఫ్లెక్సీలు తొలగించే తీరిక లేదో తెలియదు కానీ.. హ్యాండిచ్చిన నేతల ఫ్లెక్సీలు ఇంకా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దర్శనమిస్తూనే ఉన్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవాలంటే.. రాష్ట్ర ఆవిర్భవానికి ముందు.. తరువాత అని పోల్చుకోవాలి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార దరహాసంతో వెలిగిపోయింది. ఆ పార్టీలోని నేతలు కూడా అదే స్థాయిలో అగ్ర తాంబూలం అనుభవించారు. తామేంటో.. తమ బలమెంతో చూపించేందుకు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దర్పం ప్రదర్శించారు. అన్ని రోజులు ఒకలా ఉండవు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్నట్లు.. ఒకప్పుడు కళకళ లాడిన కాంగ్రెస్‌ పార్టీ నేడు వెలవెలబోతోంది. భవిష్యత్‌పై అశో… లేక ప్రస్తుతం పార్టీలో ఉన్న పరిస్థితులో తెలియదు కానీ… కమిట్మెంట్ ఉన్న నేతలు కూడా.. కారణం లేకుండా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పారు.

ప్రధానంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కె.ఎస్ రత్నం సహా పలువురు నేతలు.. టిఆర్ఎస్‌లో చేరారు. డీకే అరుణ లాంటి వారు బీజేపీ గూటికి చేరారు. వారంతా కాంగ్రెస్ పార్టీని వీడి… నెలలు కూడా గడుస్తున్నా.. వారున్నప్పుడు గాంధీ భవన్‌కి కట్టిన ఫ్లెక్సీలు ఇంకా అలానే దర్శనమిస్తున్నాయి. గాంధీ భవన్ వర్గాలపై కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. పార్టీపై అభిమానంతో ఉన్న వారికంటే.. అవకాశ వాదంతో వెళ్లిపోయిన వారి పైనే రాష్ట్ర నాయకత్వానికి ప్రేమ ఎక్కువగా ఉందని చర్చించుకోవడం చర్చించుకుంటున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి వచ్చిన వారంతా.. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కొసమెరుపు.