Hyderabad Rains: హైదరాబాద్లో భారీ వర్షం.. పాతబస్తీలో ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్(Hyderabad Rains) మహానగరంలో కురిసిన భారీ వర్షం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.
Heavy rain in hyderabad two youth die of electrocution in old city
- పాతబస్తీలో వర్షానికి విద్యుత్ వైర్లు తెగాయి
- నీటిలో ఉన్న వైర్లు తొక్కి ఇద్దరుమృతి
- చాంద్రాయణగుట్టలో తీవ్ర విషాద ఛాయలు
Hyderabad Rains: హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. పాతబస్తీలోని బండ్లగూడ ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడిపోయాయి. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు ఊహించని విధంగా ఈ ఘోర ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఆటో దిగిన ఆ యువకులు రోడ్డుపై నిలిచిన వర్షపు(Hyderabad Rains) నీటిలో మునిగి ఉన్న లైవ్ విద్యుత్ తీగలను గమనించలేకపోయారు. ప్రమాదవశాత్తూ ఆ వైర్లపై కాలు పెట్టడంతో క్షణాల వ్యవధిలోనే తీవ్రమైన కరెంట్ షాక్కు గురయ్యారు. మృతులను చాంద్రాయణగుట్టకు చెందిన జాఫర్ (25), అబూ (16)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ఉదంతంతో చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విద్యుత్ అధికారులు రంగంలోకి దిగి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో వర్షాలు పడుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై నీరు నిలిచినప్పుడు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
