ఆన్‌లైన్‌లో ప్రేమ.. మరొకరితో పెళ్లి.. యువకుడు అరెస్ట్

  • Published By: vamsi ,Published On : March 21, 2020 / 06:38 PM IST
ఆన్‌లైన్‌లో ప్రేమ.. మరొకరితో పెళ్లి.. యువకుడు అరెస్ట్

Updated On : March 21, 2020 / 6:38 PM IST

సినిమాల్లో.. అందులోనూ పాత సినిమాల్లో కనిపించే సీన్ ఇది. సినిమాల్లో అయితే ఇంట్రస్టింగ్‌గా ఉండే సీన్ ఏ కానీ, రియల్ లైఫ్‌లో మాత్రం కుటుంబాలను బాధపెట్టే విషయం ఇది. ఒక అమ్మాయితో ప్రేమాయణం నడిపాడు.. మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. మరో గంటలో పెళ్లి పీటలెక్కి తాళికట్టాల్సి ఉండగా.. యువకుడిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

రామగిరి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆర్కుటి మహేందర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలోని సీటూ క్వార్టర్‌ ఏరియాలో నివసించే నాగెల్లి వరుణ్‌కుమార్‌ అనే యువకుడు నాలుగేళ్లుగా ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన యువతి ప్రశాంతితో నెట్టింట్లో వరుణ్‌కు పరిచయం అయ్యింది. నిత్యం చాటింగ్‌ చేస్తూ చివరకు పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు.

ఈ క్రమంలోనే స్వదేశానికి వచ్చినప్పుడల్లా ఆమెను కలిసేవాడు వరుణ్. అయితే నెల రోజుల కింద వరుణ్‌కుమార్‌ స్వదేశానికి రాగా, ఇంట్లో కుటుంబ సభ్యులు సూర్యాపేట జిల్లాకు చెందిన మరో అమ్మాయి వేదతో వివాహం నిశ్చయించారు. వరుణ్‌ కుడా తన ప్రేమ సంగతి చెప్పకపోవడంతో మార్చి 21న పెళ్లి కుదిర్చారు పెద్దలు. అయితే వరుణ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుసుకున్న ప్రశాంతి ఆత్మహత్యాయత్నం చేసింది. 

వెంటనే గమనించిన ప్రశాంతి కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌లో చేర్పించి హైదరాబాద్‌లోని ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన అక్కడి పోలీస్‌ అధికారులు రామగిరి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి పెళ్లి ఆపి, వరుణ్‌ని అదుపులోకి తీసుకుని ముషీరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.