హైదరాబాద్‌లో హైటెక్ పోలీస్ : సిగ్నల్ జంపింగ్‌పై డ్రోన్ కన్ను

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 09:49 AM IST
హైదరాబాద్‌లో హైటెక్ పోలీస్ : సిగ్నల్ జంపింగ్‌పై డ్రోన్ కన్ను

Updated On : January 31, 2019 / 9:49 AM IST

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్  సిగ్నల్ జంప్ చేశారంటే డ్రోన్  కన్నుకు చిక్కిపోతారు జాగ్రత్త. ఎన్నో రకాల పనులపై హడావిడిగా తిరిగే నగరవాసులు ఎవరూ చూడటం లేదు కదా అని సిగ్నల్ జంప్ చేసేస్తుంటారు. కానీ ఇప్పుడది కుదరనే కుదరదు. ఒకవేళ మీరు జంప్ చేశారో..డ్రోన్లు వెంటాడి మరీ మీమ్మల్ని పోలీసులకు పట్టిస్తాయి. ఈ సరికొత్త టెక్నాలజీ.. తొలిసారి హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది హైదరాబాద్ పోలీస్ శాఖ.

 

నేరాలపై డ్రోన్స్ నిఘా : నేరాలు కొత్త కోణంలో జరుగుతున్న క్రమంలో నేరగాళ్లపై నిఘా..ఇంటి పన్నుల లెక్కింపు, ఏరియల్ సర్వే వంటి పలు విధాల పనుల విషయంలో టెక్నాలజీని వినియోగిస్తున్నారు అధికారులు. కాలు కదపకుండానే అన్ని వివరాలు సేకరించి సంబంధిత అధికారులకు సమయాన్ని ఆదా చేస్తాయి ఈ డ్రోన్లు.  
 

నేరాల నియంత్రణ నుంచి పౌర సేవల వరకు ఏ పనైనా సరే సమర్థంగా నిర్వహించేలా ఈ డ్రోన్లను రూపొందిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక సంస్థ సైంట్ ఈ బాధ్యతలు తీసుకుంది. మల్టిపుల్ డ్రోన్ల లాంచ్ ద్వారా నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు.. ఆ పరిధిలోని పలు ప్రాంతాలపై  డ్రోన్స్ నిఘా ఉంచాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహణకు సైతం డ్రోన్లను వినియోగించే యోచనలో ఉన్నారు. ఈ డ్రోన్‌లకు అమర్చే థర్మల్ కెమెరాలు అగంతుకుల కదలికలను పసిగట్టి పోలీసులను అప్రమత్తం చేస్తాయి. డ్రోన్ డిప్లాయిమెంట్ వెహికల్ ద్వారా ఈ డ్రోన్లను కంట్రోల్ చేస్తారు. 

తెలంగాణ ఎన్నికల్లో డ్రోన్స్ వినియోగం : సైంట్ రూపొందించిన డోన్లను ఇటీవల తెలంగాణ ఎన్నికలకు కూడా వినియోగించారు. ముఖ్య నేతల బహిరంగ సభల్లో పోలీసులు డ్రోన్లతో నిఘా ఉంచారు. బహిరంగ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కూడా డ్రోన్లను ఉపయోగించడం గమనార్హం. ప్రపంచంలోని వివిధ దేశాలు ఇప్పటికే డ్రోన్లను వివిధ సేవలకు వినియోగిస్తున్నాయి.