ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో పిటిషన్‌

  • Published By: veegamteam ,Published On : October 6, 2019 / 01:26 PM IST
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో పిటిషన్‌

Updated On : October 6, 2019 / 1:26 PM IST

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై  విచారణ ముగిసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి నివాసంలో వాదనలు జరిగాయి. ఆర్టీసీ యాజమాన్యంతోపాటు రెండు కార్మిక సంఘాలకు నోటీసులు జారీచేసింది హైకోర్టు. తదుపరి విచారణను అక్టోబర్ 10 వ తేదీకి వాయిదా వేశారు.

తక్షణమే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేలా ఆదేశించాలంటూ పిటిషనర్‌ ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ సురేంద్ర సింగ్‌ పిల్‌ వేశారు. కార్మికుల సమస్యలపై కమిటీ వేయాలని వ్యాజ్యంలో కోరారు. సమ్మె కారణంగా లక్షలమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని పిటిషన్‌లో తెలిపారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది అన్నారు. ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కమిటీ వేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పలు దఫాలుగా కార్మికులతో చర్చించామని.. వారి డిమాండ్లు న్యాయబద్దంగా లేవన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతుందని చెప్పారు. ప్రయాణికులు ఇబ్బందులు కలుగుకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి హైకోర్టు ఆదేశించింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మూడు గంటలుగా సమీక్ష కొనసాగుతోంది. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సీఎస్‌ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అక్టోబర్ 5 నుంచి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తోన్న సంగతి తెలిసిందే. సమ్మె రెండో రోజు కొనసాగుతోంది సమ్మె చట్ట వ్యతిరేకమని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ.. 49733 మంది ఆర్టీసీ ఉద్యుగుల్లో కేవలం 160 మంది మినహా మిగతా సిబ్బంది సమ్మె బాట పట్టారు. పండుగ సీజన్ కావడంతో.. సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఆర్టీసీ సమ్మె కారణంగా ఇబ్బంది పడుతున్నారు.

ఆర్టీసీ కార్మికుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై టీ-సర్కార్‌ మరింత ఫోకస్‌ పెట్టింది. దసరా పండుగ కోసం స్వస్థలాలకు వెళ్తున్న వారికి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో ప్రయాణికులకు ఊరట లభిస్తోంది. తాత్కాలిక పద్ధతిన నియమించిన డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు రోడ్డెక్కుతున్నాయి. జిల్లాల్లో డిపోల నుంచి కొన్ని బస్సులు బయటకు వచ్చాయి. టీఎస్‌ ఆర్టీసీ పోలీసు బందోబస్తు మధ్య బస్సులను నడుపుతోంది. కానీ డిమాండ్‌కు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.