హైదరాబాద్ గ్రీనరీ కోసం : ప్రతి శుక్రవారం హరిత దినం

నగరంలోని 20 ప్రధాన కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. ఇప్పటికే మూసీ సుందరీకరణ, చెరువుల అభివృద్ధి, ఫ్లై ఓవర్లకు సొగసులు, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రహదారుల్లోని మీడియన్‌లను కొత్తగా సీజనల్ పూలతో పునరుద్ధరించాలని, అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కును మరింత ఆకర్షణీయంగా రూపొందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది.
అర్బన్ బయో డ్రై వర్సిటీ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ 2019, ఫిబ్రవరి 28వ తేదీ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సుందరీకరణ పనులను వివిధ కంపెనీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకునట్లు తెలిపారు. ప్రధాన రహదారులకిరువైపులా చెట్లను పెంచడం, రోడ్లు అద్దంలా ఉండేలా చేయడం ఇతరత్రా పనులను వివిధ కంపెనీలు చూస్తాయన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ పనులను ఆయా కంపెనీలు చేపట్టనున్నాయి.
నగరంలో ప్రతి శుక్రవారం హరిత దినోత్సవంగా పాటించనున్నట్లు చెప్పారు. ప్రతి శుక్రవారం జోనల్, డిప్యూటీ కమిషనర్లు విధిగా తమ పరిధిలోని పార్కులను సందర్శించి కాలనీ సంక్షేమ సంఘాలతో సమావేశం కావాలని, పార్కుల అభివృద్ధిపై చర్చిస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 60 లక్షల మొక్కలను 56 నర్సరీలో పెంచుతున్నట్లు కమిషనర్ తెలిపారు.