ఈసారైనా.. హుస్సేన్ సాగర్ క్లీన్ అవుతుందా?

  • Published By: sreehari ,Published On : October 10, 2020 / 07:54 PM IST
ఈసారైనా.. హుస్సేన్ సాగర్ క్లీన్ అవుతుందా?

Updated On : October 10, 2020 / 8:06 PM IST

Hyderabad Hussain Sagar : హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరిట.. ఇప్పటివరకు వందల కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. కానీ.. అక్కడ ప్రోగ్రెస్ ఏమీ కనిపించడం లేదు. పూర్తిగా మురికినీటితో నిండిపోయిన హుస్సేన్ సాగర్‌ని.. క్లీన్ చేయడం అంత ఈజీగా అయ్యే పని కాదని తేలిపోయింది. సాగర్‌ని.. క్లీన్ చేయాలంటే అంతకంటే ముందు ఏం చేయాలి? హుస్సేన్ సాగర్‌ను ఖాళీ చేసి.. పూడిక తీసి.. పూర్తిగా శుద్ధి చేయాలంటే.. అంత సులువేం కాదు. సాగర్‌ని ప్రక్షాళన చేయాలంటే.. దానికంటే ముందు అందులోకి వచ్చే మురుగును ఆపాలి. ఆ తర్వాతే.. వ్యర్థాల తొలగింపు, నీటిని ఖాళీ చేయడం, పూడిక తీయడం లాంటి పనులు ముందుకు సాగుతాయి.



హైదరాబాద్‌లోని నాలుగు ప్రధాన నాలాల నుంచి.. హుస్సేన్ సాగర్‌లోకి మురుగునీరు వచ్చి చేరుతోంది. బల్కపూర్, బంజారా, పికెట్ నాలా నుంచి సీవరేజ్ వాటర్ సాగర్‌లోకి వస్తుండగా.. కూకట్‌పల్లి నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థ జలాలు, కెమికల్ వ్యర్థాలు వచ్చి సాగర్‌లో కలుస్తున్నాయి. దీంతో.. హుస్సేన్ సాగర్ మొత్తం విషతుల్యమైపోయింది. రోజూ.. 5 వందల నుంచి 550 MLDల సీవరేజ్ వ్యర్థాలు హుస్సేన్‌సాగర్‌లో కలుస్తున్నాయి.

వీటిలో.. ఒక్క కూకట్‌పల్లి నాలా నుంచి వచ్చే రసాయన వ్యర్థాలే దాదాపు 350 MLDల దాకా ఉంటాయంటున్నారు అధికారులు. అందువల్ల.. కూకట్‌పల్లి నాలా నుంచి వచ్చే ప్రమాదకర పారిశ్రామిక రసాయన వ్యర్థాలు.. హుస్సేన్ సాగర్‌లో కలవకుండా నేరుగా మూసీకి మళ్లించారు. ఇందుకోసం.. జలమండలి 50 కోట్లు ఖర్చుచేసింది. ఇప్పుడు దాదాపు 6 కోట్లతో నెక్లెస్ రోడ్డులో 150 MLD సామర్థ్యంతో ఇంటర్‌సెప్షన్ అండ్ డైవర్షన్‌ని HMDA నిర్మిస్తోంది.



తాజాగా సాగర్‌లోకి వచ్చే నాలాల నుంచి మురుగుతో పాటు చెత్త, వ్యర్థాలు వచ్చి కలుస్తున్నాయి. వీటిని నిలువరించేందుకే ప్రత్యేక టెక్నాలజీ అవసరమని నిర్ణయించింది హెచ్ఎండీఏ. ఇందుకోసం.. డెన్మార్క్‌ దేశానికి చెందిన డెస్మితో ఒప్పందం కుదుర్చుకుంది.

నాలాల దగ్గర ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా నాలాల్లోకి మురుగుతో పాటు వచ్చే వ్యర్థాలను నిలువరించి ఎప్పటికప్పుడు యంత్రాల సాయంతో తొలగిస్తారు. 9 నెలల పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్‌ని డెస్మి కంపెనీ నిర్వహించనుంది. సికింద్రాబాద్ నుంచి పికెట్ నాలాకు, సంజీవయ్య పార్క్ దగ్గర ఈ బూమ్ బారియర్ అండ్ ఆటోమేటెడ్ రైజర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. మరో 2 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది.



ఇప్పటివరకు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరిట.. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టింది. అయినప్పటికీ.. సాగర్ పరిస్థితిలో ఆశించదగ్గ మార్పు మాత్రం రాలేదనే విమర్శలున్నాయి. ఇక.. బయో రెమిడియేషన్ నిర్వహణ పేరిట HMDA భారీగానే ఖర్చు చేసింది. ఈ ప్రయోగం మొదట్లో కొంత ఫలితాలు ఇచ్చినా.. తర్వాత పెద్దగా మార్పు కనిపించకపోవడంతో.. జూన్‌లో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది హెచ్ఎండీఏ.



శుద్ధిలో భాగంగా.. హుస్సేన్ సాగర్‌లో వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది హెచ్ఎండీఏ. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం.. చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. సమగ్రంగా సమస్యను అధ్యయనం చేసి.. అధునాతన టెక్నాలజీతో సమూలు పరిష్కార పద్ధతులు అమలు చేయాలని సూచిస్తున్నారు.