కుండపోత : హైదరాబాద్‌లో 106 మి.మీ వర్షం

రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని వరుణుడు వీడడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కుండపోతగా వర్షం కురిసింది. అల్వాల్ టెలికాం కాలనీలో 6 గంటల వ్యవధిలో 106 మి.మీటర్ల వర్షం పడింది. బేగంపేట విమానాశ్రయం వద్ద 2013 అక్టబర్ 10న 98.3 మి.మీటర్ల వర్షం పడిందని వాతావరణ శాఖ తెలిపింది. గత పదేళ్ల అక్టోబర్ నెలలో ఒక రోజు అత్యధిక వర్షపాతంగా నమైదైందని అధికారులు వెల్లడించారు. ఈ రికార్డు శుక్రవారం కురిసన వర్షంతో కొట్టుకపోయింది.
శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షాలు అక్కడక్కడ కురిసే సూచనలున్నాయన్నారు. భారీ వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రహదారులపై భారీగా నీరు చేరడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నడుంలోతు నీరు నిలవడంతో అక్కడక్కడ ట్రాఫిక్ స్తంభించింది. జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి..చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులో వరద పోటెత్తడంతో పాదచారులు, వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. వరద ఉధృతి పెరుగుతూ ఇళ్లలోకి నీరు చేరింది. జనజీవనం అతలాకుతలమైంది.
వరద అంతకంతకు పెరగడంతో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. నేరేడ్ మెట్ డిఫెన్స్ కాలనీ పరిధిలోని అమ్ముగూడ, వివేకానందపురం, భరణి కాలనీలోని ఇళ్లలో నీరు చేరడంతో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర సామాగ్రీ పాడయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. హెచ్ఏఎల్ కాలనీలో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
Read More : ఇంకెన్ని రోజులో : ఆర్టీసీ సమ్మె..ప్రయాణికుల అవస్థలు