కేసీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయొద్దు : కార్యకర్తలతో కేటీఆర్

TRS అంటే…తిరుగులేని రాజకీయ శక్తి..మే నెలలో వచ్చే ఫలితాల్లో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2019, ఏప్రిల్ 27వ తేదీ శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేటీఆర్.. జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లికి నివాళులర్పించారు. ఎన్నికల కోడ్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కేడర్ ఉండడంతో నిరాడంబరంగా వేడుకలు జరుపుకుంటున్నట్లు చెప్పారు. త్వరలో జరిగే జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాల్లో ఎక్కువ స్థానాలు టీఆర్ఎస్‌కే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : గ్రీన్ కలర్ లో కొత్త రూ.20 నోటు
ఎన్నో పార్టీలు వచ్చినా.. కేవలం ఇద్దరు మాత్రమే తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటారన్నారు. ఒకరు ఎన్టీఆర్ (టీడీపీ) అయితే, మరొకరు కేసీఆర్ (టీఆర్ఎస్) అన్నారు. 1982లో ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించిన సమయంలో ఎన్నో అనుకూల అంశాలు ఆయనకు ఉన్నాయని.. కేసీఆర్‌కు మాత్రం ఎలాంటి ఛరిష్మా లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఉద్దండులైన పార్టీలు (టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ) ఉన్నాయని గుర్తు చేశారు. 71లో ఉద్యమం పడిపోయిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పేరిట కొన్ని పార్టీలు పుట్టినా.. అవి నిలదొక్కుకోలేదన్నారు. ఈ సమయంలో ఏమాత్రం ఛరిష్మా లేని కేసీఆర్.. 2001లో జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఆనాడు కేసీఆర్ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయన్నారు. రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో..ఒక పార్టీని ఏర్పాటు చేసి..13 ఏళ్లలో సాధించడం, సీఎం కావటం గొప్ప అదృష్టం అన్నారు. 18 ఏళ్లలో ఎత్తులు..పల్లాలు..ఎదురుదెబ్బలు ఎన్నో తగిలాయన్నారు. వాటిని ఎంతో హుందాగా, దైర్యంగా ఎదుర్కొని నడిచిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయవద్దని కార్యకర్తలు, నేతలకు సూచించారు కేటీఆర్. ఈ వేడుకల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : నిప్పుల కొలిమి : వరల్డ్ 15 హాటెస్ట్ నగరాలు భారత్‌లోనే