చల్లని వేళ జరభద్రం : పిడుగుల హెచ్చరిక

హైదరాబాద్ : భగ్గున మండే ఎండలతో సతమతమవుతున్న రాష్ర్టాన్ని చల్లటి చిరుజల్లులు పలుకరించాయి. తెలంగాణలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షపు జల్లులు సేదతీర్చాయి. చల్లబడిన వాతావరణంతో మరో రెండు రోజుల పాటు నగరవాసులు ఎంజాయ్ చేయవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఓ మోస్తరు జల్లులు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో నేడు, రేపు అంటే ఏప్రిల్ 7,8 తేదీలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. కాగా గత మూడు రోజులుగా పలు ప్రాంతాలలో చిరు జల్లులతో తెలంగాణలో వాతావరణం కాస్త చల్లబడింది. శనివారం (ఏప్రిల్ 6 ఉగాది రోజున) కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. బలంగా వీస్తున్న ఈదురు గాలుల కారణంగా చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు గరిష్టానికి చేరుకున్నాయనీ..ఆదిలాబాద్‌లో శనివారం 42.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో పిడుగులు పడే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బలమైన ఈదురు గాలులకు తోడు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.