హైదరాబాద్‌లో నీటిలో కరిగే ప్లాస్టిక్ కవర్లు

ప్లాస్టిక్ ను తగ్గించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వాడకం తగ్గందే సమస్యకు ముగింపు దొరికేట్లుగా కనిపించడం లేదు. పారేసిన ప్లాస్టిక్ కవర్ వ్యర్థాలు భూమిలో కరగడానికి వేల సంవత్సరాల పడుతుండటమే దీనికి కారణం. అందుకోసమే కొత్త టెక్నిక్ ను కనుగొన్నారు. కేవలం 24 గంటలపాటు నీటిలో ఉంచితే కరిగే కవర్లను తయారుచేసేందుకు హైదరాబాద్‌లోని నాలుగు కంపెనీలు ముందుకొచ్చాయి.
నీటిలో కరిగిపోయే స్వభావం గల బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు 4 కంపెనీలు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని ప్లాస్టిక్ ఉత్పత్తులను సర్టిఫై చేసే సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) టెస్టింగ్, అనుమతి కోసం పంపించారు.
ప్లాస్టిక్ వినియోగంతోనే కాదు, తయారీ ప్రక్రియ ద్వారా సైతం పెద్దఎత్తున కాలుష్యం వెలువడుతోంది. ప్లాస్టిక్ ఉత్పత్తి సమయంలో కార్బన్ మోనాక్సైడ్ వంటి కాలుష్య కారక రసాయనాలు వెలువడుతున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ప్లాస్టిక్ పెద్దమొత్తంలో భూమిపై చేరడంతో నీరు ఇంకే పరిస్థితి కనిపించడంలేదు. భూ పొరలు పటుత్వాన్ని కోల్పోతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో రోజూ 40 టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. ప్లాస్టిక్ ప్రమాదం నుంచి ఇకనైనా తప్పించుకోవాలని నియంత్రణకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన కవర్లపై నిషేధం విధించింది. ప్రత్యామ్నాయంగా వస్త్ర సంచులు, జ్యూట్ బ్యాగులను విరివిగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. ప్లాస్టిక్‌ను లిక్విడ్‌గా మార్చి రోడ్లు వేయడంలోనూ వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ ఇటుకలు, బ్రిక్స్‌ను రూపొందిస్తున్నారు. కొంతమంది ప్లాస్టిక్ ఫర్నిచర్ తయారీలోనూ వాడుతున్నారు.