పెప్పర్ స్ప్రేలతో ఆఫీస్ కు మహిళా తహశీల్దార్ లు

  • Published By: venkaiahnaidu ,Published On : November 13, 2019 / 05:28 AM IST
పెప్పర్ స్ప్రేలతో ఆఫీస్ కు మహిళా తహశీల్దార్ లు

Updated On : November 13, 2019 / 5:28 AM IST

ఇటీవల హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మహిళా ఎమ్మార్వోలు అందరూ వాళ్లను వాళ్లు కాపాడుకునేందుకు ఆత్మరక్షణలో భాగంగా తమ వెంట పెప్పర్ స్ప్రేలు తెచ్చుకోవాలని అధికారులు సూచించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. రాష్ట్రంలో దాదాపుగా 1,000మంది తహశీల్దార్ లు ఉన్నారు. ఇందులో 400మంది మహిళా తహశీల్దార్ లు ఉన్నారు.

విజయారెడ్డిపై ఊహించనివిధంగా అకస్మాత్తుగా దాడి జరిగిందని,దీంతోమహిళా తహశీల్దార్ లు తమపై ఇలాంటి దాడులు జరగకుండా మరింత అప్రమత్రంగా ఉండాలని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని,వారు తమ వెంట పెప్పర్ స్ప్రేలు తెచ్చుకోవాలని వారికి సూచించినట్లు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.లచ్చిరెడ్డి తెలిపారు. వినతులతో వచ్చే విజిటర్స్ తహశీల్దార్ లను కలవాలనుకుంటే వారి వెంట తెచ్చుకున్న క్యారీ బ్యాగ్ లను అనుమతించబోమని,విజయారెడ్డి లాంటి ఘటన మరొకటి పునరావృతం కాకూడదని తెలంగాణ తహశీల్దార్ ల అసోసియేషన్ కి చెందిన ఎస్. రాములు తెలిపారు.
 
ఇటీవల సిరిసిల్ల పట్టణంలో తహశీల్దార్ ను కలవడానికి వచ్చిన ఓ వ్యక్తి తన వెంట పెట్రోల్ తీసుకొచ్చిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. చాలా మంది వ్యక్తులు పెట్రోల్ బాటిల్స్ తీసుకుని రెవెన్యూ ఆఫీసులకు వెళ్లి హల్ చల్ చేస్తున్నారు. ఇది కూడా ఉద్యోగుల్లో టెన్షన్ పెంచింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ బంకులు పెట్రోల్ పోసే విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఎవరైనా బాటిల్ లో పెట్రోల్ పోయాలని వస్తే వారిని తిప్పి పంపేయాలని ఆదేశించారు. దీంతో బాటిళ్లలో పెట్రోల్ పోసేది లేదని బంకుల ఓనర్లు బోర్డులు పెట్టేశారు.