ఆపరేషన్‌ స్మైల్‌ : 2,425 మంది చిన్నారులు సేఫ్ 

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 06:30 AM IST
ఆపరేషన్‌ స్మైల్‌ : 2,425 మంది చిన్నారులు సేఫ్ 

హైదరాబాద్ : గత 4 విడతలుగా ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 22 వేల మంది చిన్నారులను పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థలు రక్షించారు. వీరిలో 60% మందిని తల్లిదండ్రులకు అప్పగించగా, మిగతా వారి ని స్టేట్‌ హోమ్స్‌కు తరలించి విద్య, వసతి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఐదవసారి చేపట్టిన ఈ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా..పారిశ్రామిక వాడల్లో బాల కార్మికులుగా ఉన్న వారిని గుర్తించడం, బెగ్గింగ్‌ మాఫియా కింద భిక్షాటనలో నలిగిపోతున్న చిన్నారులను రెస్క్యూ చేయడం, వ్యభిచారంలో మగ్గుతున్న మైనర్లను బయటపడేసేందుకు కృషి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 174 మంది అధికారులను ప్రత్యేకంగా ఆపరేషన్‌ స్మైల్‌ కోసం రంగంలోకి దించారు.

 

ఈ క్రమంలో ఆపరేషన్ స్మైల్ చిన్నారుల పాలిట రక్షణ కవచంలా మారింది. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ స్మైల్ ద్వారా 2019 జనవరి 1 నుంచి నెలాఖరు అంటే 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా..రెస్క్యూ కార్యక్రమం ద్వారా 2,425 మంది పిల్లలను కాపాడి పునరావసం కల్పించారు. ఈ విషయాన్ని  రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీ తెలిపారు. నగర శివారులోని వెంగళరావునగర్‌ డివిజన్‌ స్టేట్‌హోం క్యాంపస్ లో మంగళవారం (ఫిబ్రవరి 12)న ప్రెస్ మీట్ ద్వారి లక్ష్మీ ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఆపరేషన్‌ స్మైల్ ద్వారా  కాపాడిన చిన్నారుల్లో 1841 మంది బాలురు..584 మంది బాలికలు ఉన్నారని తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 2168 మంది పిల్లలు ఉండగా, బిహార్‌ 21, ఒడిషా 4, ఏపీ 3, అసోం 2, దిల్లీ 1, కర్ణాటక 10, మహారాష్ట్ర 10, యూపీ 6, పశ్చిమబంగా 1, పంజాబ్‌ 2, ఛత్తీస్‌ఘడ్‌ 1, రాజస్థాన్‌ 1, ఝార్ఘండ్‌ 3, ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం 66 మంది ఉన్నట్లు వివరించారు. వీరిని బస్‌స్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు పార్కులు, పబ్లిక్‌ ప్రదేశాలు, ఖార్కానాల్లో గుర్తించామని వెల్లడించారు. 
ఈ విధంగా కాపాడిన పిల్లల వివరాలను మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మిస్సింగ్‌ చైల్డ్‌ పోర్టల్‌లో పొందుపర్చినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆశ్రమాల ముందు, రోడ్లపైన బస్‌స్టేషన్‌లలో, మత పరమైన ప్రదేశాలలో చిన్నారులు ఎక్కువ ఉంటున్నట్టు గమనించినట్టు అధికారులు పేర్కొన్నారు.