హైదరాబాద్ యువకుడిని హత్య చేసిన పాకిస్తానీ: 22ఏళ్ల జైలు శిక్ష

  • Published By: vamsi ,Published On : October 11, 2019 / 04:50 AM IST
హైదరాబాద్ యువకుడిని హత్య చేసిన పాకిస్తానీ: 22ఏళ్ల జైలు శిక్ష

Updated On : October 11, 2019 / 4:50 AM IST

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని పాకిస్తాన్ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఉద్యోగ రీత్యా లండన్ లో ఉండే హైదరాబాద్ కి చెందిన నదీమ్‌ ఉద్దీన్‌ హమీద్‌ మొహమ్మద్‌ (24), పాకిస్తాన్ కి చెందిన పెర్విజ్ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు.

అయితే నదీమ్.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడేమె అని అనుమానించాడు పెర్విజ్. ఈ క్రమంలోనే పదునైన కత్తితో పొడిచి నదీమ్ ని చంపేశాడు పెర్విజ్. ఈ ఘటన లండన్ లో చోటుచేసుకోగా నిందితుడికి లండన్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

భార్య తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్పినా కూడా పెర్విజ్..  నదీమ్ ని దారుణంగా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా.. దారుణంగా హత్య చేశాడు. దీంతో న్యాయస్థానం అతనికి పెరోల్‌ దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 22ఏళ్ల పాటు జైలులో శిక్ష అనుభవించాలంటూ స్పష్టం చేసింది.

పదునైన ఆయుధాన్ని కలిగి ఉన్నందుకు మరో 18నెలల శిక్ష విధించింది. యావజ్జీవ శిక్షతో పాటు దీనిని కూడా అనుభవించాలని చెప్పింది. ‘మీ భార్య, కుటుంబ సభ్యులు, మరణించిన మొహమ్మద్‌లు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని ఎంత చెప్పినా వినలేదు’ అని తీర్పు సందర్భంగా కోర్టు పెర్విజ్ కు చెప్పింది.

ఆవేశంతో ప్రజలు చూస్తుండగానే నదీమ్‌ ని చంపేశావంటూ దోషిగా నిర్థారించింది. ఇక నదీమ్ చనిపోయే నాటికి అతడి భార్య అఫ్సా ఎనిమిది నెలల గర్భంతో ఉండగా.. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న నదీమ్ ని దారుణంగా చంపాడంటూ మృతుడి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. నదీమ్ పాతబస్తీలోని నూర్‌ఖాన్ బజార్‌కు చెందిన వ్యక్తి.