ఈసీకి కొత్త డిజైన్: కారు గుర్తు షేపులు మారాయి

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు టీఆర్ఎస్ పార్టీ రీడిజైన్ చేసిన కారు లోగోను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వల్ల 15 స్ధానాల్లో 15 వేల వరకు ఓట్లు నష్ట పోయామని సీఎం కేసీఆర్ డిసెంబర్ 27న కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పు పువనరావృతం కాకుండా, ఓటర్లకు సులువుగా కారు గుర్తు తెలిసేలా చేసిన రీ డిజైన్ ను సీఈసీ కి సమర్పించినట్లు ఎంపీ బి.వినోద్ తెలిపారు. కాగా సీఎం కేసీఆర్ చేసిన మిగిలిన విజ్ఞప్తుల పట్ల స్పందించలేదని ఆయన ఇటీవల సీఈసీ కి రాసిన లేఖలో పేర్కోన్నారు.
ట్రక్కు రైతు తో కూడిన ట్రాక్టర్, ఇస్త్రీపెట్టె, కెమెరా వంటి ఎన్నికల గుర్తులు కారు గుర్తును పోలి ఉన్నాయని వీటిని ఎవరికీ కేటాయించవద్దని కేసీఆర్ కోరారని వినోద్ లేఖలో పేర్కోన్నారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కేటాయించిన ట్రక్కు గుర్తు విషయంలో టీఆర్ఎస్ పార్టీకీ భారీ నష్టం వాటిల్లందని , ఆ విషయాన్ని సీఈసీ గమనించాలని ఆయన కోరారు. ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల పేర్లను పోలిన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వటం ద్వారా ఓటర్లను గందర గోళానికి గురి చేసిందని వినోద్ తెలిపారు. 2019 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఇటువంటి గందరగోళానికి అవకాశం లేకుండా చూడాలని ఆయన కోరారు.