చీప్ అండ్ బెస్ట్ : హైదరాబాద్ హాస్టల్ హబ్‌గా S.R.నగర్

  • Published By: madhu ,Published On : February 13, 2019 / 04:55 AM IST
చీప్ అండ్ బెస్ట్ : హైదరాబాద్ హాస్టల్ హబ్‌గా S.R.నగర్

రాష్ట్రం ఏదైనా.. ఏ ప్రాంతం వారైనా సరే హైదరాబాద్ వెళుతున్నారు అంటే.. వారికి ఠక్కున గుర్తుకొచ్చేది ఎస్ఆర్ నగర్. హోటల్స్ తోపాటు వేల సంఖ్యలో ఉండే హాస్టల్సే ఇందుకు ఓ కారణం. మరో కారణం కూడా ఉంది. సిటీకి ఇది నడిబొడ్డున ఉండటం. మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. ఐటీకి సంబంధించి లేటెస్ట్ గా వచ్చే ఏ టెక్నాలజీ కోర్సు అయినా ఎస్ఆర్ నగర్ లోని ఇనిస్టిట్యూట్ లో చెప్పేస్తారు. స్టూడెంట్స్ కు ఎన్నో అవకాశాలను ఎస్ఆర్ నగర్ కల్పిస్తోంది. అందుకే చదువు అయినా.. ఉద్యోగం అయినా హైదరాబాద్ వచ్చేవారికి ఈ ఏరియా అడ్డా అయ్యింది. వీళ్లందరికీ వసతి ఎక్కడా అంటే.. హాస్టల్స్. బాయ్స్, గాళ్స్ హాస్టల్స్. ఎన్ని ఉన్నాయేంటీ అంటే.. ఇప్పటికిప్పుడు తేలిన లెక్క అక్షరాల 12 వందలు. ఆశ్చర్యంగా ఉందా.. ఇది నిజం. పోలీసులు సైతం షాక్ అయిన ఘటన ఇది. లేడీస్, బాయ్స్ హాస్టల్స్ లో భద్రత విషయంపై ప్రతి హాస్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీస్ శాఖ ఆదేశించింది. దీంతో ఎస్.ఆర్.నగర్ ఏరియా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి.

ఈ లెక్కచాలు హైదరాబాద్ హాస్టల్ హబ్ అంటే.. SR Nagar అనటానికి. 2019, జనవరి, ఫిబ్రవరి.. రెండు నెలల్లోనే 1,200 అప్లికేషన్స్ వచ్చాయి. మరికొన్ని రావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఏ పోలీస్ స్టేషన్‌కి రాని దరఖాస్తులు ఇక్కడ వచ్చాయని, వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం జరుగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు.

ఎవరైనా హాస్టల్, పేయింగ్ గెస్ట్ ఏర్పాటు చేయాలంటే అనుమతి తప్పనిసరి తీసుకోవాలని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. పలు హాస్టల్స్‌లో వివిధ ఘటనలు వెలుగు చూడడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. హాస్టల్స్‌కు సంబంధించిన విషయంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) వెల్లడించారు. 

విద్య, ఉపాధి కోసం ఎంతో మంది హైదరాబాద్‌కు వస్తుంటారు. మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట ప్రాంతాల్లో ఐటీ, సాఫ్ట్ వేర్, ఇతర ఆఫీసులు ఎక్కువయ్యాయి. ఆఫీసులకు వెళ్లడానికి.. రావడానికి S.R.నగర్ దగ్గరగా ఉంటోంది. వివిధ హాస్టల్స్ ఓనర్స్ నెలకు రూ. 5 వేల నుంచి రూ.8వేలు తీసుకుంటున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడుతున్నారు. దీంతో చాలా మంది హాస్టళ్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. భద్రత కూడా ఉండడంతో మహిళలు చాలా మంది ఈ హాస్టల్స్‌లో ఉంటున్నారు.