మండుతున్న ఎండలు : మూగజీవాలకు ప్రత్యేక రక్షణ

  • Published By: chvmurthy ,Published On : March 4, 2019 / 03:26 PM IST
మండుతున్న ఎండలు : మూగజీవాలకు ప్రత్యేక రక్షణ

Updated On : March 4, 2019 / 3:26 PM IST

హైదరాబాద్: ఎండలు దంచేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకొస్తే చాలు  మాడు పగిలిపోతోంది. అర్జెంట్ పని ఉంటే తప్ప జనాలు ఇంటినుంచి బయటకు రావలడం లేదు. ఏసీలు, ఫ్యాన్లు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ప్రజలే ఎండను తట్టుకోలేని పరిస్థితి ఉంటే మరి మూగ జీవాల సంగతేంటి వాటికీ ప్రత్యేక ఏర్పాట్లు చేసారు జూ  అధికారులు. 
హైదరాబాద్‌ వచ్చే పర్యాటకులు సందర్శించే ప్రదేశాల జాబితాలో నెహ్రూ జూపార్క్ తప్పకుండా ఉంటుంది. నగరానికి తలమానికంగా నిలుస్తోన్న ఈ జూపార్క్ దేశంలోనే అతిపెద్దది. జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జూపార్క్.. 380 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ జంతు ప్రదర్శనశాలలో సుమారు 1500 జాతుల జంతువులు, పక్షులు ఉంటున్నాయి. 

ఈ జూ పార్క్‌లో వివిధ రకాల జంతువులు, సరీసృపాలు, పక్షులు ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, పైథాన్, కొండచిలువ, ఒరాంగుటాన్, మొసళ్లు, ఏంటేలోప్స్, జింకలు, ఇండియన్ రైనో వంటి ఎన్నో వైవిధ్య జాతుల జంతువులు ఉన్నాయి. వీటి కోసం సహజమైన వాతవరణాన్ని కల్పించారు. అయితే ఎండలు మండిపోతుండటంతో మూగ జీవాల సంరక్షణకు జూ అధికారులు చర్యలు చేపట్టారు.  

వన్యప్రాణులు, పక్షులకు చల్లదనం కోసం ఏసీ, కూలర్‌, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. అలాగే జంతువులకు అందించే ఆహారంలోనూ మార్పులు చేశారు. ఎన్‌క్లోజర్లపై మ్యాట్‌, తుంగ, గోనెసంచులు కప్పి.. అన్ని వైపుల నుంచి వట్టి వేర్లను ఏర్పాటు చేశారు. చల్లగా ఉండేలా వాటర్‌ స్ర్పింక్లర్లతో రెండు పూటలా నీటిని చల్లుతున్నారు. అందుకోసం నీటి సంపులను ఏర్పాటు చేశారు. జంతువులు, పక్షులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్‌క్లోజర్లను ఎప్పటికప్పుడు చల్లబరుస్తున్నారు  

డార్క్‌ రూమ్‌లో ఉండే గబ్బిలాలు, పాములు, గుడ్లగూబలు, ముళ్ళ పంది తదితర జంతువుల ఎన్‌క్లోజర్‌పై మ్యాట్‌, తుంగ, గోనేసంచులు వేసి నీటితో చల్లగా ఉంచుతున్నారు. వేసవి కాలంలో వన్యప్రాణులకు ఎలాంటి హాని కలుగకుండా జూ వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మందులను ఇస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నెహ్రు జూలాజికల్ పార్కుకు నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. వేసవి తాపం నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టడంతో… అటు పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూల్ వెదర్‌లో సేదదీరుతున్న జంతువులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.