స్వైన్ ఫ్లూ పంజా :  44 రోజుల్లో 489 కేసులు

  • Published By: veegamteam ,Published On : February 16, 2019 / 05:59 AM IST
స్వైన్ ఫ్లూ పంజా :  44 రోజుల్లో 489 కేసులు

హైదరాబాద్ : స్వైన్ ఫ్లూ హడలెత్తిస్తోంది. చల్లని వాతావరణంలో విజృంభించే స్వైన్ ఫ్లూ తో ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటికే నగరంలోని గాంధీ ఆస్పత్తిలో గత 44 రోజుల్లో 489 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. స్వైన్ ఫ్లూ దెబ్బకు గాంధీ ఆస్పత్తిలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 6గురు స్వైన్ ఫ్లూ బారిని పడి మృతి చెందారు.హెచ్ 1 ఎన్ 1 స్వైన్ ఫ్లూ వైరస్ మళ్లీ విజృంభిస్తోందని వైద్యులు చెబుతున్నారు. దీంతో 2019లో జనవరి నుండి 44 రోజుల్లో 489 పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లుగా గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

హైదరాబాద్ జిల్లాలో    264
మేడ్చల్                      87
రంగారెడ్డి                     59

ఇతర జిల్లాలలో             79 

కాగా..15 రోజులుగా గాంధీ జనరల్ ఆస్పత్తిలో చికిత్స పొందుతున్న విద్యానగర్ కు చెందిన 72 సంవత్సరాల వృద్ధురాలు మృతితో 2019లో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 7కు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.  దీంతో ప్రజల్లో వైరస్‌ వ్యాప్తిపై విస్తృత ప్రచారాన్ని చేసేందుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. 
 

2009లో మొదటిసారిగా వెలుగులోచ్చిన స్వైన్ ఫ్లూ వైరస్  
2009లో మొదటిసారిగా ‘హెచ్‌1ఎన్‌1’ అనే ‘ఇన్‌ఫ్లూయెంజా ఏ’ వైరస్‌ మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ ఏడాది, మరుసటి ఏడాది పెద్ద సంఖ్యలో స్వైన్‌ఫ్లూ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఏడాది నిశ్శబ్దంగా ఉన్న వైరస్‌ మళ్లీ 2012లో ప్రతాపం చూపించింది. 2013, 2014లో అంతగా ప్రభావం చూపని హెచ్‌1ఎన్‌1 మరోసారి 2015లో ఉద్ధృతంగా విరుచుకుపడింది. ఆ ఏడాది దాదాపు 3193 కేసులు నమోదవగా 110 మంది మహమ్మారికి బలయ్యారు. 2016లో నెమ్మదించిన స్వైన్‌ఫ్లూ 2017లో విరుచుకుపడింది. ఆ ఏడాదిలో 2166 కేసులు నమోదవగా.. 21 మంది మృతిచెందారు. 2018లో తొలి 8 నెలలు స్తబ్ధుగా ఉన్న హెచ్‌1ఎన్‌1 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకూ విజృంభణ కొనసాగిస్తోంది. గతేడాది ఆగస్టులో 42 కేసులు నమోదై ఐదుగురు చనిపోగా, అక్టోబరులో 319 కేసులు-10 మంది మృతి, నవంబరులో 352 కేసులు-ఆరుగురు మృతి, డిసెంబరులో 273 కేసులు నమోదై ఆరుగురు మృతిచెందారు. గత ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికంగా మహిళలు(538) ఈ మహమ్మారి బారిన పడినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. చలి వాతావరణంలో వైరస్‌ ఎక్కువ కాలం జీవించే అవకాశాలుండడంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని వైద్యశాఖ అంచనా వేస్తోంది.