16 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు!

  • Published By: madhu ,Published On : September 1, 2019 / 02:30 AM IST
16 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు!

Updated On : September 1, 2019 / 2:30 AM IST

కేసీఆర్ రెండవసారి సీఎం అయ్యాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 14 లేదా 16 తేదీలలో అసెంబ్లీని సమావేశ పరచాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. రాష్ట్రంపై ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ ఉన్నప్పటికీ  సంక్షేమం, ప్రాధాన్యత రంగాలకు ఇబ్బంది కలగకుండా బడ్జెట్‌లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. 

రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత .. లోక్ సభ ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 30 లోపు పూర్తిస్థాయి బడ్జెట్‌కు తప్పనిసరి ఆమోదం పొందాల్సిన పరిస్థితి. లేదంటే.. అక్టోబర్ నుండి ఉద్యోగ జీతభత్యాలు, ఖర్చు చేయడానికి ట్రెజరీ అనుమతి సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, సభ ఆమోదం పొందేందుకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం.

బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్న అధికారులు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ఎదుట సెప్టెంబర్ 4, 9, 14 తేదీలను ప్రతిపాదించినట్లు సమాచారం. సెప్టెంబర్ 2న వినాయక చవితి, 10న మొహరం, 11, 12 తేదీలలో  గణేష్ నిమజ్జన మహోత్సం జరుగుతుంది. దీంతో 14వ తేదీన అసెంబ్లీని సమావేశ పరిచి, బడ్జెట్ ప్రవేశపెడితే.. ఆ మరుసటి రోజు ఆదివారం సెలవు కలిసి వస్తుందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. 14వ తేదీ రెండవ శనివారం సెలవు దినం కావడంతో.. ఈనెల 16 సోమవారం నుంచి వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించడం బెటర్ అన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఇక ఈ బడ్జెట్ పై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక మాంద్యంతో తెలంగాణాలో ప్రభుత్వ ఆదాయం తగ్గింది. అయితే..ఈ ప్రభావం ప్రభుత్వ లక్ష్యాలపై ప్రభావం చూపకుండ జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం  కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతగా పెట్టుకున్న సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు కేసీఆర్.

ఆదాయ  మార్గాలను పెంచుకుంటూ, ప్రాధ్యానతలను మరువకుండా, ఖర్చులపై స్పష్టత ఉండేలా బడ్జెట్‌ను రూపొందించాలని ఇప్పటికే అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. మొత్తానికి ప్రజల మనసును చూరగొనేలా… పూర్తిస్థాయి బడ్జెట్ ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి.. ఈ బడ్జెట్‌తో కేసీఆర్, ప్రజలను ఏమేరకు మెప్పిస్తారో!