సెప్టెంబర్ 9 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 9 నుంచి బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. 9న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను కేసీఆర్ సర్కార్ సభలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ కు సంబంధించి గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియడంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. 10 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగొచ్చని సమాచారం. ఏఏ అంశాలు చర్చించాలనే విషయంపై బీఏసీలో(బిజినెస్ అడ్వైజరీ కమిటీ) డిస్కస్ చేసిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సమావేశం మొదటి రోజే సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేసీఆర్ దగ్గరే ఉంది. దీంతో కేసీఆరే స్వయంగా బడ్జెట్ ప్రవేశపెడతారు. ఓటాన్ అకౌంట్ కూడా కేసీఆరే ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ బడ్జెట్‌లో రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు అధిక మొత్తంలో కేటాయించే అవకాశాలున్నాయని సమాచారం.