జనవరి 17 నుండి టి. అసెంబ్లీ : స్పీకర్‌గా పోచారం ?

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జనవరి 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. అందరి చూపు అసెంబ్లీ వైపు ఉంది. ఎవరు స్పీకర్ కానున్నారనే హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ పదవి తీసుకొనేందుకు చాలా మంది సీనియర్లు అనాసక్తి చూపుతున్నారు. దీనితో గులాబీ బాస్ పదవిని ఎవరికి కట్టబెడితే బెటర్ అని ఆలోచిస్తున్నారు.
ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ సమావేశాలు
గురువారం నుంచి మొదలు
స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ?
క్యాబినెట్ విస్తరణపై ఆసక్తికర చర్చలు
18న విస్తరణ జరుగకపోతే ఫిబ్రవరిలోనే మంత్రి వర్గం
పార్లమెంట్ ఎన్నికల అనంతరం పూర్తి స్థాయి విస్తరణ
ఈ పదవి పొందిన వారికి పొలిటికల్‌గా కలిసి రాలేదని సీనియర్ నేతలు భావిస్తుండడమే ఇందుకు కారణమని టాక్ వినిపిస్తోంది. జనవరి 17వ తేదీన సమావేశాలు ప్రారంభమైన తరువాత జనవరి 18న సభాపతి ఎన్నిక జరుగనుంది. స్పీకర్ పదవి సీనియర్ నేతగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి దక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సామాజీక సమీకరణాలను కూడా గులాబీ దళపతి కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పదవి కోసం ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, పద్మా దేవేందర్ రెడ్డిల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే పోచారం వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందో జనవరి 18వ తేదీన తెలుస్తుంది.