188 కేంద్రాలు : కానిస్టేబుల్ తుది రాతపరీక్ష

ఆదివారం (ఏప్రిల్ 28,2019) పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష జరగనుంది. పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సివిల్ కానిస్టేబుల్ పరీక్ష జరగనుంది. దీనికి 1,05,094 మంది హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు టెక్నికల్ పేపర్ తుది రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు 5వేల 163మంది అభ్యర్ధులు హాజరవనున్నారు. హైదరాబాద్ సహా పాత పది జిల్లా కేంద్రాల్లో 188 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
పోలీస్‌శాఖలో పెద్ద సంఖ్యలో SI, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరింది. దీంతో శిక్షణపై పోలీస్‌శాఖ దృష్టిపెట్టింది. 18 వేలకుపైగా కొత్త పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై డీజీపీ మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో పోలీస్ అకాడమీ అధికారులు, పోలీస్ ట్రైనింగ్ కళాశాలల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సిబ్బంది శిక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని డీజీపీ వారికి సూచించినట్టు తెలిసింది.