పేదల కోసం: తెలంగాణలో ఉచితంగా 58 వైద్య పరీక్షలు

చిన్నపాటి అనారోగ్యంతో జ్వరంతో హాస్పిటల్ కు వెళ్లినా వేలల్లో డబ్బు ఖర్చు అవుతోంది. ఆ టెస్టులు..ఈ టెస్టులు అంటూ డబ్బులు నీళ్లలా ఖర్చయిపోతున్నారు. పేదలకు ఇది పెను భారంగా మారింది. దీనిపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం పేదలకు మొత్తం 58 రకాల పరీక్షల్ని పూర్తి ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
బ్లడ్ టెస్ట్ , మల, మూత్ర పరీక్షలు, టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణ టెస్ట్ లతో పాటు లివర్, కిడ్నీలు, థైరాయిడ్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి మొత్తం 58 రకాల పరీక్షలు పూర్తి ఉచితంగా చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ సదుపాయం అన్ని జిల్లాల్లోని ప్రభుత్వం హాస్పిటల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని జిల్లాల్లోను డయాగ్నస్టిక్ హబ్ నెలకొల్పేందుకు అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు.
రోగనిర్ధారణ పరీక్షలకు గతంలో ప్రత్యేకంగా బడ్జెట్ అంటూ ఉండేది కాదు. కానీ సీఎం కేసీఆర్ పాలన ప్రజారోగ్యంపై దృష్టి పెట్టింది. దేశంలోనే తొలిసారిగా అన్ని జిల్లాల్లోను డయగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటు..వాటి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించింది. దాంతో డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహణకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి.. ప్రజలకు ఈ సేవలు అందేలా చర్యలు తీసుకుంది.
రోగం ఏదో తెలుసుకునేందుకే వేలల్లో ఖర్చు అవుతున్న క్రమంలో పేదలకు ప్రభుత్వం అందించే ఈ సేవలు వరంగా మారనుంది. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఈ ఆధునిక మిషన్లతో ఏర్పాటు చేసి పేదలకు పరీక్షల్ని చేస్తారు.
పరీక్షలు జరిగే తీరుతో పటు ఈ మిషన్ల ఏవైనా సమస్యలు అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే..వాటిని సాల్వ్ చేయటానికి తగిన చర్యలు తీసుకొనేలా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఈ మిషన్ల నిర్వహణకు ప్రతీ సంవత్సరం రూ.14 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర ఆరోగ్యంగా ఉంటుందనే మంచి ఆలోచనతో ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి అమలు చేయనుంది.